విద్యుత్ శాఖకు పార్లమెంటరీ కమిటీ సూచన
న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్లమెంటరీ కమిటీ విద్యుత్ మంత్రిత్వ శాఖను కోరింది. అలాగే బిల్లింగ్, డేటా గోప్యత, ఆర్‌డిఎసఎస్ లక్ష్యాలపై ఆందోళనలు లేవనెత్తింది. స్మార్ట్ మీటర్ల బిగింపు నిర్మాణాత్మకంగా, సమయానుకూల పద్ధతిలో వేగవంతం చేయడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని తెలిపింది. ‘విద్యుత్ మంత్రిత్వ శాఖ గ్రాంట్ల డిమాండ్ల(2026-27)’పై కమిటీ 11వ నివేదికను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల బిగింపు వేగం ఊహించిన లక్ష్యాల కంటే చాలా తక్కువగా ఉన్నందున, రాష్ట్రాల వారీగా, యుటిలిటీ వారీగా స్పష్టంగా నిర్వచించబడిన లక్ష్యాలతో నిర్మాణాత్మకంగా , సమయానుకూల పద్ధతిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును గణనీయంగా పెంచడానికి మంత్రిత్వ శాఖ అత్యవసర చర్యలు చేపట్టాలని నివేదిక స్పష్టం చేసింది. మార్చి 2025 నాటికి దేశంలో 25 కోట్ల స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఫిబ్రవరి 15, 2026 నాటికి కేవలం 5.83 కోట్ల స్మార్ట్ మీటర్లను మాత్రమే ఏర్పాటు చేశారని నివేదిక పేర్కొంది. దేశంలో స్మార్ట్ మీటర్ల సంస్థాపన రేటు రోజుకు దాదాపు 1,35,000కి పెరిగినప్పటికీ, సవరించిన కాలక్రమంలో అంటే మార్చి 2028 వరకు పేర్కొన్న లక్ష్యం, సంబంధిత ఫలితాల మధ్య భారీ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఇది ఇప్పటికీ సరిపోకపోవచ్చునని కమిటీ అభిప్రాయపడింది. ఇంకా బిల్లింగ్ తప్పులు, డేటా మైగ్రేషన్ సమయంలో లోపాలు, డేటా గోప్యతపై ఆందోళనలు, వినియోగదారు మీటర్లను తరచుగా మార్చడం మొదలైన వాటి గురించి రాష్ట్రాలలో వినియోగదారులు తరచుగా ఫిర్యాదులు నివేదిస్తున్నారని పేర్కొంది.


