స్పీకర్ నిర్ణయమే అంతిమం: సుప్రీం – Visalaandhra


న్యూదిల్లీ: తెలంగాణలో బీఆరఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్నిరోజులుగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను గురువారం సుప్రీంకోర్టు ముగించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా… స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆరఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు రాగా… సర్వోన్నత న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆరఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసును జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించగా… స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ఇప్పటికే విచారణ జరిపి… తగిన నిర్ణయం తీసుకున్నారని ఆయన కోర్టుకు వివరించారు. ఈ సమస్య సభాపతి కార్యాలయంలోనే ముగిసిందన్నారు. సింఘ్వీ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం… ఈ వ్యవహారంపై స్పీకర్ ఇప్పటికే తుది నిర్ణయం తీసుకున్నందున విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని భావించింది. దీంతో కోర్టు విచారణ ముగిసినట్లేనని వెల్లడించింది. స్పీకర్ ఆదేశాలను రెండు రోజుల్లో అధికారికంగా ప్రచురించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ తరువాత పిటిషనర్లకు కావాల్సిన పత్రాలను కూడా నాలుగు రోజుల్లో అందజేయాలని సూచించింది. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు సభాపతి క్లీన్‌చిట్ ఇచ్చినట్లు అయింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *