నేడు పార్లమెంటు ముందుకు
200 మంది ఎంపీల సంతకాలు
న్యూదిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అభిశంసనకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. పార్లమెంటు ఉభయ సభల్లో శుక్రవారం నోటీసు సమర్పించనున్నాయి. 130 మంది లోక్సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు దీనిపై సంతకాలు చేశారు. గురువారం కూడా కొందరు సభ్యులు ముందుకొచ్చి సంతకాలు చేశారని ప్రతిపక్ష నాయకుడు ఒకరు తెలిపారు. నిబంధనల ప్రకారం 100 మంది ఎంపీలు సంతకాలు చేస్తే లోక్సభలో, 50 మంది మద్దతిస్తే రాజ్యసభలో సీఈసీపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష ఇండియా ఐక్య సంఘటన ఎంపీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ఒకే మాటపై ఉన్నారు. అయితే సీఈసీ అభిశంసన కోరుతూ పార్లమెంటులో నోటీసు ఇవ్వడం ఇదే మొదటిసారి. వివక్షపూరిత ప్రవర్తన, అధికార దుర్వినియోగం, ఎన్నికల మోసాలపై దర్యాప్తులను అడ్డుకోవడం వంటి ఏడు ఆరోపణలతో నోటీసు ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సీఈసీ అనేక సందర్భాల్లో… ప్రత్యేకించి ఎసఐఆర్ క్రమంలో అధికార బీజేపీకి మద్దతిచ్చినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. పశ్చిమ బెంగాల్లో ఎసఐఆర్ క్రమంలో అర్హులైన ఓటర్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేశాయి. సీఈసీని తొలగించే విధానం… సుప్రీం కోర్టు లేదా హైకోర్టు జడ్జిని తొలగించే ప్రక్రియకు సమానంగా ఉంటుంది. అసమర్థత రుజువు అయితేనే అభిశంసన సాధ్యమవుతుంది. పార్లమెంటు ఉభయ సభల్లో ఏదో ఒక చోట ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి, మెజారిటీ సభ్యులు మద్దతిస్తే సీఈసీని తొలగించవచ్చు. కాగా, ఓటింగ్లో 2/3వ వంతు సభ్యులు తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. సీఈసీ, ఈసీల నియామక చట్టం ప్రకారం సీఈసీని పదవి బాధ్యతల్లో నుంచి తప్పించాలంటే సుప్రీంకోర్టు జడ్జిని తొలగించే తరహా విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అదే ఈసీలను తొలగించాలంటే తప్పనిసరిగా సీఈసీ సిఫార్సు చేయాల్సిన అవసరం ఉంది.


