పూర్తి సహకారం


సీఎం రేవంత్
విశాలాంధ్ర – హైదరాబాద్: నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని, తమ దృష్టి హాలీవుడ్‌పైనే అని తను గతంలోనే చెప్పానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతుందని, నెట్‌ఫ్లిక్స్, ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. డీవీడీ అద్దె సంస్థ నుంచి నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ ఓటీటీ లీడర్‌గా, మీడియా స్టూడియోగా ఎదగడం చూస్తుంటే సంభ్రమాశ్చర్యంతో పాటు చాలా ఆదర్శంగా అనిపిస్తుందని అన్నారు. హైటెక్స్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐ లైన్ స్టూడియోస్‌ను గురువారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సినిమాలపై ఆసక్తి ఉందని, బాల్యం నుంచి చూస్తే సినిమాలో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. బాహుబలి, కల్కి, ఆరఆరఆర్, అరుంధతి వంటి అత్యున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయన్నారు. చెన్నైలో ఉన్న సినిమా పరిశ్రమను ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నామని, విస్తరణకు కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. నెట్ ఫ్లిక్స్ కార్పొరేట్ కార్యాలయాన్ని ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణ కు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. వినోద రంగంలో ప్రసిద్ధి చెందిన నెట్ ఫ్లిక్స్, ఐలైన్ హైదరాబాదుకు రావడం శుభపరిణామమన్నారు. నెట్ ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ, మంచి కంటెంట్‌ను సేకరించి వీక్షకులకు అందిస్తుందని, అందరికీ వినోదం ఇవ్వడమే నెట్‌ఫ్లిక్స్ ధ్యేయమని వివరించారు. ప్రపంచ సంస్థలకు వేదికవుతూ అన్ని రకాల సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడమే హైదరాబాద్ లక్ష్యమన్నారు. నెట్‌ఫ్లిక్స్ ఇటీవల క్రీడలపై దృష్టి పెట్టిందని, రానున్న రోజుల్లో నెట్‌ఫ్లిక్స్ క్రీడా ప్రసార సంస్థగా మారుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు, క్రీడలకు సంబంధించి అన్ని స్థాయిలలో ప్రతిభను ప్రోత్సహిస్తున్నామని, ఇందుకు నెట్ ఫ్లిక్స్ సహకారం కావాలన్నారు. ప్రపంచ వినోద పరిశ్రమలో భారత్, తెలంగాణ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు.
ఏవీజీసీ గ్లోబల్ లీడర్‌గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఓ వైపు అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే… మరోవైపు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ పై దృష్టి సారించిందన్నారు. హైదరాబాద్ కు నెట్ ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్ లో ‘తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ స్టాండర్డ్స్, అడ్వాన్స్డ్ టూల్స్, ఇన్నోవేషన్-లెడ్ వర్క్ ఫ్లో ఇక్కడి ఎకో సిస్టంలో భాగమవుతాయని, యువతకు ఫ్యూచర్ రెడీ స్కిల్స్ లభిస్తాయన్నారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో స్టూడియో ఏర్పాటుకు ముందుకు రావాలని ఆహ్వానించారు.

The post పూర్తి సహకారం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *