మోడల్ కాలనీగా వెలుగుమట్ల – Visalaandhra


. మంత్రి తుమ్మల హామీ
. భూదాన్ భూముల్లో 38 ఇళ్లకు భూమి పూజ
. ఉగాదిలోపు విద్యుత్ సరఫరా పనుల పూర్తికి ఆదేశం

విశాలాంధ్రబ్యూరో – ఖమ్మం: వెలుగుమట్లను మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్వాసితుల 38 ఇళ్లకు గురువారం మంత్రి తుమ్మల… ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి భూమి పూజ చేశారు. నిర్వాసితులకు ఇచ్చిన మాట ప్రకారం యుద్ధ ప్రాతిపదికన భూదాన్ భూముల్లోనే లబ్ధిదారులు కోరిన విధంగానే 311 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. భూమి పూజ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలోనే మోడల్ కాలనీగా వెలుగుమట్లను తీర్చి దిద్దుతామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన తల్లి సోనియాగాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 నాటికి కాలనీ పూర్తి చేస్తామని తెలిపారు. గత ఎనిమిదేళ్లలో ఇక్కడి పేదలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలు కూడా లేకుండా బాధలు పడ్డారని తెలిపారు. పేదలను దిన దిన గండం నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందన్నారు. భూదాన్ భూములు ఆక్రమించుకోవాలని సీసీఎలఏ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూల్చివేతలు జరిగాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన తల్లి సోనియాగాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 నాటికి వెలుగుమట్ల కాలనీ పూర్తి చేస్తామని తెలిపారు. పేదలకు పంచిన తర్వాత మిగిలిన భూమిలో స్కూల్, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు. పేదలకు ఇంటి నిర్మాణానికి సున్నావడ్డీతో రుణాలు అందిస్తామని… గహనిర్మాణ శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. వెలుగుమట్ల లేఔట్ లో కరెంటు పోల్స్, విద్యుత్ సరఫరా పనులు యుద్ధ ప్రాతిపదికన ఉగాది లోపు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి పైప్ లైన్ పనులు చేపట్టాలన్నారు. దళారులకు ఎవరు ఎంత డబ్బులు ఇచ్చారన్న వివరాలు పోలీసు అధికారులకు అందించాలని సూచించారు. ప్రజలను మోసం చేసిన ఎవరిని విడిచి పెట్టే సమస్య లేదని కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, హౌజింగ్ పిడి శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *