హైదరాబాద్: ‘గబ్బర్ సింగ’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ తాజాగా చిత్రబృందం మూడో గీతం ‘కాలరే ఎత్తరా’ను విడుదల చేసింది. గురువారం సాయంత్రం అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్ లోని మైత్రి విమల్ థియేటర్ లో ఈ గీతావిష్కరణ వేడుక వైభవంగా జరిగింది. ‘కాలరే ఎత్తరా’ పాట విడుదలతో సినిమాపై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. భారీ స్థాయిలో రూపొందించిన ఈ పాటలో భారీ సెట్లు, కట్టిపడేసే విజువల్స్, అద్భుతమైన ఎనర్జీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ తన ప్రత్యేకమైన స్టైల్, ఎనర్జీ, డ్యాన్స్ స్టెప్పులతో తెరపై వెలుగులు నింపారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం, రామ్ మిర్యాల ఉత్సాహభరితమైన గానం, కాసర్ల శ్యామ్ శక్తివంతమైన సాహిత్యం కలిసి.. సినిమా యొక్క మాస్ అప్పీల్‌ను ప్రతిబింబించేలా ఉంది ఈ గీతం. ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ తో సినిమా అనగానే కథ కూడా వినకుండా సినిమా చేయడానికి అంగీకరించిన రాశి ఖన్నాకు ముందుగా కృత్ఞఙతలు. ఈ పాటలో కూడా కళ్యాణ్ గారితో కలిసి అద్భుతంగా డ్యాన్స్ చేశారు రాశి. 1500-2000 మందితో భారీస్థాయిలో ఈ పాటను తెరకెక్కించాం” అన్నారు. నిర్మాత రవిశంకర్ యలమంచిలి మాట్లాడుతూ.. “ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చాలా బాగా వచ్చిందని… ‘గబ్బర్ సింగ’ స్థాయికి తగ్గకూడదనే కసితో దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించారన్నారు. కథానాయిక రాశి ఖన్నా మాట్లాడుతూ.. “మీ అందరి ఉత్సాహం చూస్తుంటే పాట ఎంతగానో నచ్చిందని అర్థమవుతోంది. నేను కూడా ఈ పాటను ఎంతో ఎంజాయ్ చేశాను. నా కెరీర్ ప్రారంభం నుంచి నాకు ఒకే ఒక్క కోరిక ఉండేది.. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలని. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. ఒక మాస్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి డ్యాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు. దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది.” అన్నారు. గీత రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ… “అభిమానుల ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ఈ పాట నచ్చింది అనుకుంటున్నాను. భీమ్లా నాయక్ లో రెండు మంచి పాటలు రాసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి డ్యాన్స్ నెంబర్ రాయలేదనే వెలితి ఉండేది. ‘కాలరే ఎత్తరా’తో ఆ వెలితి తీరిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీతం అదిరిపోయింది. కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ఇలాంటి అత్యద్భుతమైన పాటను రచించే అవకాశమిచ్చిన మైత్రి మూవీ మేకర్స్ కి కృత్ఞఙతలు. ఈ ఉగాది పండుగను ‘ఉస్తాద్ భగత్ సింగ’తో మరింత ఉత్సాహంగా జరుపుకుందాం.” అన్నారు.


