టమాటా పంట… రైతుల కళ్లలో కన్నీళ్లు


విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. అనంతపురం జిల్లా రైతులకు టమాటా పంట ఈసారి ఆశల కంటే ఎక్కువ బాధను మిగిల్చింది. వేల ఎకరాల్లో ఎంతో కష్టపడి సాగు చేసిన టమాటా పంటకు మార్కెట్‌లో సరైన ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో కలిసి చెమటోడ్చి పండించిన టమాటా ఇప్పుడు కిలోకు రెండు నుంచి మూడు రూపాయలకే పడిపోవడం రైతులను కలచివేస్తోంది. పంట కోయడానికి వచ్చే ఖర్చు కూడా రాకపోవడంతో చాలామంది రైతులు టమాటాను పొలాల్లోనే వదిలేస్తున్నారు. “ఎరువులు, విత్తనాలు, కార్మిక ఖర్చులు అన్నీ పెట్టాం… కానీ ఇప్పుడు పంటను కోయడానికి కూడా డబ్బు రావడం లేదు” అని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గం, రాప్తాడు, రాయదుర్గం, ఉరవకొండ , శింగనమల, నియోజకవర్గంలో టమోటా సాగు వేల ఎకరాల్లో సాగుచేశారు. కష్టంతో పెంచిన పంట నేలపై పడి కుళ్లిపోతుండడం చూసి రైతుల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా టమాటా అధికంగా పండటం, ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గిపోవడం వల్ల ధరలు ఒక్కసారిగా క్షీణించాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో రెండు నెలలు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. అయితే రైతులు మాత్రం ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస ధర కల్పించాలని కోరుతున్నారు. లేదంటే ఇప్పటికే అప్పుల భారం మోస్తున్న రైతులకు ఈ పరిస్థితి మరింత కష్టాలను తెచ్చిపెడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *