2028 వరకు పొడిగించిన కేంద్ర క్యాబినెట్
న్యూదిల్లీ: ఇంటింటికీ కొళాయి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకం అమలు కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. 2028 డిసెంబరు వరకు పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2019-2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలుకాని విషయాన్ని ప్రభుత్వం పరిగణనలో తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దీనిపై నిర్ణయం తీసుకుంది. ఈ పథకం మొత్తం కేటాయింపులను రూ.8.69 లక్షల కోట్లకు పెంచింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని 2019-20లో ఆమోదించిన రూ.2.08 లక్షల కోట్ల నుంచి రూ.3.59 లక్షల కోట్లకు పెంచాలని నిర్ణయించింది. దీనితో రాష్ట్రాలకు రూ.1.51 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం కలగనుంది. సమావేశ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరులకు వెల్లడించారు. పథకం కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం- అందులో నిర్మాణాత్మక సంస్కరణలకూ శ్రీకారం చుట్టనుంది. పథకం అమలును పర్యవేక్షించేందుకు జాతీయస్థాయిలో సుజలం భారత్ పేరుతో ఒక డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను అమల్లోకి తేనుంది. దీనికింద ప్రతి పల్లెను ఒక సుజల గ్రామంగా గుర్తించి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. ఈ పథకం కింద చేపట్టిన పనులు పూర్తయినట్లు గ్రామపంచాయతీలు ధ్రువీకరించి, ప్రతి ఇంటికీ కొళాయి నీరు అందించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పథకం నిర్వహణకు అవసరమైన యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తాయి. దీనితో చాలా గ్రామాల్లో ఇంకా పూర్తి కాని ఈ ప్రక్రియ కొనసాగడానికి అవకాశం దొరికినట్టయింది.


