విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : సమాజంలో నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న మోసాలు, అఘాయిత్యాలపై విద్యార్థులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అనంతపురం రూరల్ డివిజన్ ఇన్చార్జి డిఎస్పి మహబూబ్ బాషా సూచించారు. ఎస్పీ జగదీష్ గారి ఆదేశాల మేరకు మంగళవారం గొల్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలిట్ పాఠశాలలో ఎండి కృష్ణ భరత్, కరస్పాండెంట్ కృష్ణ సమీరా ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు సురక్ష వాహనంలోని డిజిటల్ స్క్రీన్ ద్వారా సైబర్ క్రైమ్, రోడ్డు భద్రత, మహిళలు, చిన్నారుల రక్షణపై ప్రత్యేక వీడియోలను ప్రదర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక మాధ్యమాలైన వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తులతో ఫోటోలు దిగకూడదని, వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫేక్ కాల్స్, బ్యాంక్ అధికారుల పేరుతో వచ్చే ఓటీపీ మోసాల పట్ల అవగాహన, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు.
బాలికలు ఆపద సమయంలో తమను తాము ఎలా రక్షించుకోవాలో సూచనలు. ప్రమాద సమయాల్లో 100, 112, 1098, 181 నంబర్లను సంప్రదించాలని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రతాప రెడ్డి, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


