–పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం పై చర్చలు
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో చర్చలు జరిపినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం పై ఇరువురి అగ్రనేతలు చర్చలు జరిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాలో నెలకొన్న అనిశ్చితి, యుద్ధ పరిస్థితుల గురించి ఇరువురు నేతలు దాదాపు గంటసేపు మాట్లాడుకున్నట్లు తెలిపింది. యుద్ధం కారణంగా తమ మిత్ర దేశమైన ఇరాన్ పెద్ద మొత్తంలో నష్టపోతుండడంపై రష్యా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తంచేసినట్లు పేర్కొంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతోన్న సాయుధ సంఘర్షణ ముగింపునకు తీసుకోవాల్సిన దౌత్య చర్యలపై కొన్ని ప్రతిపాదనలను పుతిన్… ట్రంప్ ముందు ఉంచినట్లు రష్యా విదేశాంగ సలహాదారు యూరి ఉషాకోవ్ తెలిపారు. ఇరాన్‌తో జరుగుతోన్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ట్రంప్‌నకు సూచించినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు విషయంపై అమెరికా ప్రతినిధులతో జరుగుతోన్న ద్వైపాక్షిక చర్చల పైనా వారు మాట్లాడుకొన్నట్లు ఉషాకోవ్ పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ నూతన సుప్రీంతో చర్చలు జరిపిన పుతిన్ తెహ్రాన్‌కు తాము సంపూర్ణ మద్దతిస్తామని హామీ ఇచ్చారు. ఘర్షణలు ఉదృతం అవుతున్న వేళ ఇరువురి అగ్రదేశాధినేతల చర్చలు శాంతి నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. ఆదిశగా చర్చలు ఫలించాలని శాంతి కోరుకునే ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.


