. ఖామేనీ రెండో కుమారుడి ఎన్నిక
. దేశవ్యాప్తంగా సంబరాలు
. తెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు మరింత తీవ్రం
. బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ప్ర తి దాడులు
తెహ్రాన్: ఇజ్రాయిల్, అమెరికాతో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంది. అమెరికా హెచ్చరికలను భేఖాతరు చేస్తూ ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖామేనీని కొత్త నేతగా ప్రకటించింది. ఇరాన్‌లోని 88మంది మతగురువులతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స’ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు ముజ్తబాను ఎన్నుకుంది. ఇస్లామిక్ రిపబ్లిక్లో అత్యంత రహస్య వ్యక్తిగా పేరొందిన మొజ్తబా ఖామేనీ, ఇరాన్ యుద్ధ వ్యూహంలో ఇప్పుడు కీలక పాత్ర పోషించనున్నారు. శక్తిమంతమైన రివల్యూషనరీ గార్డ్స్ ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తాయి. ముజ్తబా ఇప్పటివరకు ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ ప్రభుత్వ పదవినీ చేపట్టలేదు. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ముజ్తబాఖామేనీ ఎన్నిక కావడం పట్ల ఆదేశ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అనేక మంది మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి తమ ఆనందం వ్యక్తం చేశారు. 1969లో మషాద్ నగరంలో జన్మించిన ముజ్తబా… చిన్నతనం నుంచే తన తండ్రి షా పాలనను చూస్తూ పెరిగారు. ఇరాన్-ఇరాక్ యుద్ధంలో రివల్యూషనరీ గార్డ్స్ తరపున పోరాడారు. 1989లో తన తండ్రి అయాతుల్లా ఖామేనీ సుప్రీం లీడర్ అయిన తర్వాత, ముజ్తబాక్రమంగా తన పట్టును పెంచుకున్నారు. 2008 నాటి వికీలీక్స్ పత్రాలు ఆయన్ను తెర వెనుక అసలు అధికారిగా అభివర్ణించాయి. 2005, 2009 ఎన్నికల్లో అహ్మదీ నెజాద్ గెలుపులో ముజ్తబాకీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్‌తోపాటు లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై అమెరికా, ఇరాన్ దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్‌లోని చమురు నిల్వ కేంద్రాలపై దాడుల కారణంగా వెలువడుతున్న పొగలు పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, ఇరాన్ ప్రతిదాడులను కూడా తీవ్రతరం చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4లో భాగంగా పెద్దఎత్తున బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపైకి ప్రయోగించింది. ఇరాన్ లక్ష్యాలు పౌర మౌలిక సదుపాయాల వైపు కూడా మళ్లాయి.
ఇజ్రాయిల్, అమెరికా స్థావరాలపైకి బాలిస్టిక్ క్షిపణులు
మరోవైపు ఇరాన్ ప్రతిదాడులను కూడా తీవ్రతరం చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4లో భాగంగా పెద్దఎత్తున బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయిల్, అమెరికా స్థావరాలపైకి ప్రయోగించింది. ఇరాన్ లక్ష్యాలు పౌర మౌలిక సదుపాయాల వైపు కూడా మళ్లాయి. గల్ఫ్ దేశాల తాగునీటి అవసరాలకు అత్యంత కీలకమైన డీశాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ దాడి చేసిందని బహ్రెయిన్ ఆరోపించింది. సౌదీ అరేబియాలోని ఒక నివాస ప్రాంతంలో ఇరాన్ క్షిపణి పడి బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు మతి చెందారు. ఈ యుద్ధంలో సౌదీలో సంభవించిన మొదటి మరణాలు ఇవే కాగా 12 మంది బంగ్లాదేశీయులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలపై దాడులు చేస్తూ ఇరాన్ బాధ్యతారాహిత్యమైన విధానాన్ని అవలంబిస్తోందని అరబ్ లీగ్ చీఫ్ మహ్మద్ అబ్దుల్ గెయిట్ మండిపడ్డారు. గల్ఫ్ దేశాలపై ఇప్పటికే వందలాది క్షిపణులు, డ్రోన్ దాడులు జరిగాయని తెలిపారు. పలువురు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. అటు గల్ఫ్ దేశాలపై దాడుల విషయంలో క్షమాపణలు చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్, ఆదివారం తన స్వరం మార్చారు. ఇరాన్‌పై ఎంత ఒత్తిడి పెరిగితే ప్రతిస్పందన కూడా అంతే బలంగా ఉంటుందని హెచ్చరించారు. పొరుగు దేశాలు అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు సహకరించవద్దని కోరారు.
ఏం జరుగుతుందో చూద్దామన్న ట్రంప్
మరోవైపు ఇరాన్ నాయకత్వంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఇరాన్ కొత్త నాయకుడు ఎవరైనా తమ ఆమోదం ఉండాలని, లేకపోతే వారు ఎక్కువ కాలం కొనసాగలేరని ట్రంప్ హెచ్చరించారు. మ్పు్తుబా నాయకత్వాన్ని తాను అంగీకరించబోనని ఇప్పటికే ట్రంప్ స్పష్టం చేశారు. అటు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వీడియో సందేశం ద్వారా ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇరాన్‌ను నిరంకుశత్వ పాలన నుంచి విముక్తి చేయడమే తమ లక్ష్యమన్న ఆయన, ఇరాన్ ప్రజలు తిరగబడితే ఇరు దేశాలు మళ్లీ మంచి మిత్రులుగా మారే రోజు ఎంతో దూరంలో లేదని పిలుపునిచ్చారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు మరింత తీవ్రం
మరోవైపు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఇజ్రాయిల్ దళాలు ఇప్పటివరకు సుమారు 3,400 దాడులు నిర్వహించాయని ఐడీఎఫ్ ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. 150కి పైగా ఇరాన్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇరాన్‌పై ఇప్పటివరకు 7,500 క్షిపణులను ప్రయోగించినట్లు వెల్లడించారు. ఆపరేషన్ తదుపరి దశకు చేరుకుందన్న ఆయన, ఇరాన్‌లోని కీలక ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా దాడులను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయిల్, అమెరికా దాడుల కారణంగా ఇరాన్ అంతటా సుమారు 10వేల పౌర కట్టడాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ దాడుల వల్ల తెహ్రాన్‌లోని చమురు నిల్వ కేంద్రాల నుంచి దట్టమైన పొగ వెలువడుతోంది. ఇది పర్యావరణ ముప్పునకు దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
హిజ్బుల్లా ప్రధాన కార్యాలయాలు ధ్వంసం
లెబనాన్ రాజధాని బీరూట్‌లోని దహియే శివారు ప్రాంతంలో హిజ్బుల్లా ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా గ్రూపును లక్ష్యంగా చేసుకుని సాగుతున్న పోరాటంలో ఇద్దరు ఇజ్రాయిల్ సైనికులు మరణించారు. లెబనాన్‌లోని దక్షిణ నగరం సిడాన్‌లోని ఐన్ ఎల్ హిల్వే అనే అతిపెద్ద పలస్తీనా శరణార్థి శిబిరం సమీపంలో ఇజ్రాయిల్ క్షిపణులు పడి ఒకరు మతి చెందగా… పలువురు పౌరులు, లెబనీస్ సైనికులు గాయపడ్డారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఏడో అమెరికా సైనికుడు మరణించినట్లు అమెరికా రక్షణ శాఖ ధృవీకరించింది. మార్చి 1న సౌదీఅరేబియాలో అమెరికా దళాలపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన సైనికుడు చికిత్స పొందుతూ మరణించాడని తెలిపింది.


