హైదరాబాద్: హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అక్కడ ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే 50 వేల డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 41 లక్షలు) పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో బుకింగ్స్ మరింత పుంజుకుంటాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు విదేశాల్లో ఉన్న బలమైన ఫ్యాన్ బేస్, అలాగే హరీశ్ శంకర్‌తో ఆయన కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా ఉండటంతో ఈ క్రేజ్ ఏర్పడింది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, నార్త్ అమెరికా మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు. ఈ జోరు చూస్తుంటే ప్రీమియర్లతోనే భారీ వసూళ్లు రాబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది.
అలాంటి పాట ఉండదా?
ఈ సినిమాలో హీరోయిన్స్ గా శ్రీలీల, రాశిఖన్నా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చి అభిమానుల్ని అలరించాయి. కానీ గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఆల్బమ్ పెద్ద హిట్ అయింది. పైగా ఆ ఆల్బమ్‌లో ఐటమ్ సాంగ్ కూడా పెద్ద హిట్. ఇపుడు మళ్లీ అలాంటి కలయికలో వస్తున్న ఈ సినిమాలో అదే తరహా ఐటెం సాంగ్‌ని మళ్లీ చాలా మంది ఆశించవచ్చు. కానీ అలాంటివి ఏమీ లేవని హరీష్ స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘ఒక ఐటెం గర్ల్ వెనకాల పడే వ్యక్తిగా పవన్ కళ్యాణ్‌ని చూపించలేను. ఇప్పుడు తనకి ఉన్న హోదా దృష్ట్యా అలాంటివి చేయడం సబబు కాదు’ అని హరీశ్ స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది.


