విశాలాంధ్ర – ఏలూరు : జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు ఛాంబర్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళలందరికీ జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సంధర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, కుటుంబం నుంచి దేశ, రాష్ట్ర అభివృద్ధి వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుతూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. మహిళలు సాధికారతకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక, సామాజికంగా మరింత బలోపేతం కావాలని జిల్లా కలెక్టరు ఆకాంక్షించారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అన్ని రంగాలలో మహిళలు పురోగతి సాధించడం ద్వారా సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మహిళలు తమ హక్కులు, అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధిలో మహిళలు భాగస్వామ్యం మరింత పెరగాలని ఆమె ఆకాంక్షించారు.


