త్వరలోనే రివర్స్ మైగ్రేషన్


. నాడు కుటుంబ నియంత్రణ-నేడు జనాభా నిర్వహణ
. అమరావతిలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్
. దిల్లీలో రైసినా డైలాగ్ సదస్సులో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : గతంలో సిలికాన్ వ్యాలీ లాంటి చోటుకు భారత్ నుంచి మేధో వలస జరిగిందని, త్వరలో రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖఅబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహించిన రైసినా డైలాగ్ సదస్సులో సాంకేతికతసుపరిపాలనభవిష్యత్ అనే అంశంపై చంద్రబాబు మాట్లాడారు. సహకార సమాఖ్య దేశంగా కేంద్రంతో, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని సీఎం వివరించారు. ఐటీలో భారతీయుల పరిజ్ఞానం అందరికీ తెలిసిందేనని, డిప్లొమసి, ఫ్లెక్సిబిలిటీ విషయాల్లో వారికి మంచి పేరు ఉందని ముఖ్యమంత్రి అన్నారు. నైపుణ్యం, వనరులు ఉన్న చోటుకే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం మేర జీసీసీలు భారత్‌కు వచ్చాయన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా భారత్ దూసుకువెళుతోందని తెలిపారు. భవిష్యత్‌లో అనేక దేశాలకు విద్యుత్‌ను భారత్ ఎగుమతి చేస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా భారతీయులు కనిపిస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. టెక్నాలజీ, టెలి కమ్యూనికేషన్స్ లాంటి సంస్కరణలను మొదటగా అందిపుచ్చుకోవటం వల్లే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం వివరించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోందని, ఆ ప్రమాదాన్ని గుర్తించి ముందుగానే జాగ్రత్త పడుతున్నామని అన్నారు. భారత్‌లోని దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 1.5 ఫెర్టిలిటీ రేటును 2.1 గా తీసుకెళ్లేందుకు పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని తీసుకువచ్చామని తెలిపారు. ప్రజాప్రతినిధిగా 30 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణ గురించి ప్రచారం చేసి… ఇప్ప్పుడు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి అనేక ప్రయోజనాలు కల్పిస్తామని సీఎం చెప్పారు. వద్ధాప్య సమస్యను ఎదుర్కొంటున్న దేశాలు జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. మూడో బిడ్డ పుడితే రూ.25 వేల ఆర్థిక సాయం, నెల వారీగా రూ.వెయ్యి అందించాలని నిర్ణయించామని చెప్పారు. చైల్డ్ కేర్ లీవ్‌లాంటి ప్రోత్సాహకాలు ఆలోచిస్తున్నామని, భవిష్యత్‌లో గ్లోబల్ కమ్యూనిటీకి సేవలు అందించే సామర్థ్యం భారత్‌కు మాత్రమే ఉందన్నారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఇప్ప్పుడు జనాభా వృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గతంలో ఉన్న పెద్ద కుటుంబాలు దేశానికి పెద్ద ఆస్తి అని, ప్రస్తుతం అవి మైక్రో ఫ్యామిలీలుగా మారాయన్నారు. ఈ విషయంలో ప్రజల దృష్టి కోణం మార్చాలన్న ప్రయత్నంలో ఉన్నామని ముఖ్యమంత్రి వివరించారు. విభిన్నంగా ఆలోచన చేసే వారి కోసం అమరావతిలో క్రియేటివ్ సిటీతో పాటు డ్రోన్ సిటీ, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ సిటీలను కూడా నిర్మిస్తున్నామని అన్నారు. సమీప భవిష్యత్‌లో ఆరోగ్య రంగంలో భారీ మార్పులు రానున్నాయని, గతంలో ఊహగానే ఉన్న డ్రోన్ అంబులెన్సులు ఇప్ప్పుడు వాస్తవంలోకి వచ్చేశాయన్నారు. ఏఐ డేటా సెంటర్లతో ఏపీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ డెస్టినేషన్‌గా ఏపీ తయారవుతుందని తెలిపారు. మెరుగైన సదుపాయాలతో వ్యాపార అనుకూల ప్రాంతంగా ఆంధ్ర ప్రదేశ్‌ను తీర్చిదిద్దామని, పెట్టుబడులతో వస్తే జాప్యం లేకుండా అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ సహా 110 దేశాల నుంచి 2,700 మందికి పైగా ప్రతినిధులు, మేధావులు, నిపుణులు, వ్యూహకర్తలు హాజరయ్యారు. 2016 నుంచి జరుగుతున్న ప్రతిష్ఠాత్మక రైసినా డైలాగ్ సదస్సుకు తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నిర్వాహకులు ఆహ్వానం పలకడంతో సీఎం చంద్రబాబు హాజరయి తన అభిప్రాయాలను వెల్లడించారు.

The post త్వరలోనే రివర్స్ మైగ్రేషన్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *