తెలంగాణలో ముందుగానే ముదిరిన ఎండలు..


ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
ములుగు జిల్లాలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న‌ ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్‌లలోనూ 38.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా 2.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రాబోయే రోజులకు సంబంధించి కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు ప్రకటించారు. ఈ వారంలో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 1.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణ వైపు పొడి, వేడి గాలులు వీస్తుండటమే ఈ తీవ్రతకు ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటంతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం పూట అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.

శరీరం డీహైడ్రేట్ కాకుండా నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడేవారు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున, వారు మరింత జాగ్రత్తగా చల్లని ప్రదేశాల్లో ఉండాలని సూచించారు.

The post తెలంగాణలో ముందుగానే ముదిరిన ఎండలు.. appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *