ఒక్కరు వద్దు… ఇద్దరు ఒకే… ముగ్గురు ముద్దు
. సంతాన సాఫల్య రేటు 2.1కి పెంచేలా ప్రణాళికలు
. ప్రభుత్వాసుపత్రుల్లో ఫెర్టిలిటీ సెంటర్లు
. మూడో సంతానానికి రూ.25 వేల ప్రోత్సాహకం
. కొత్త పాలసీపై ప్రజాభిప్రాయ సేకరణ
. జనాభా వృద్ధికి నూతన విధానం
. ‘జనాభా నిర్వహణ’ ముసాయిదాపై చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇన్నాళ్లూ కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని, ఇకపై ‘పాపులేషన్ కేర’పై దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. జనాభా నిర్వహణ ముసాయిదా విధానంపై శాసనసభలో గురువారం ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఏపీలో ప్రస్తుతం టోటల్ ఫెర్టిలిటీ రేటు (టీఎఫఆర్) 1.5గా ఉందని, దీనిని 2.1కి పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాల్లో ఫెర్టిలిటీ రేటు తగ్గుతోందని, భారతదేశంలోనూ, ముఖ్యంగా ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొందని సీఎం అన్నారు. 1992-93లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీఎఫఆర్ 3.0గా ఉండేదని గుర్తు చేశారు. టీఎఫఆర్ మరింత వేగంగా తగ్గితే శ్రామికశక్తి పడిపోతుందని, దీంతో ఆర్థిక వృద్ధి మందగిస్తుందని చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మరింత నష్టం వాటిల్లుతుందనే ఆలోచనతో ఈ ముసాయిదా పాలసీకి రూపకల్పన చేశామని వివరించారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో కేవలం ఏడాదికి 6.70 లక్షల జననాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇదిలాగే కొనసాగితే 2047 నాటికి రాష్ట్ర జనాభాలో 23 శాతం మంది వృద్ధులే ఉంటారని చెప్పారు. ‘పాపులేషన్ మేనేజ్‌మెంట’ పాలసీ డాక్యుమెంట్ అందరికీ అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌లో పెడుతున్నట్టు సీఎం ప్రకటించారు. దీనిపై ప్రతి నియోజకవర్గంలో నెల రోజుల పాటు ప్రజాప్రతినిధులు ప్రజýతో చర్చించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి నెలా నాలుగో శనివారం జనాభా నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీకి తుదిరూపు ఇచ్చి… ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామన్నారు. ఏడాది తర్వాత ఫలితాలు పరిశీలించి పాలసీలో మార్పులు చేర్పులు చేస్తామని వెల్లడించారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ అనేది పాపులేషన్ మేనేజ్‌మెంట్‌తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మాతృత్వ, శక్తి, క్షేమ, నైపుణ్యం, సంజీవనిని పాపులేషన్ మేనేజ్‌మెంట్‌కు మూలస్తంభాలుగా పేర్కొన్నారు.
మహిళల శ్రామికశక్తి పెరిగితే జీఎస్డీపీ వృద్ధి
‘మహిళల వర్క్‌ఫోర్స్ కేవలం 31 శాతం మాత్రమే ఉంది. ఇది 59 శాతానికి చేరుకుంటే రాష్ట్ర జీఎస్డీపీ 15 శాతం పెరుగుతుంది. గర్భధారణ నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వ మద్దతు ఉంటుంది. పిల్లలు లేక, ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతిస్తాం. మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వాసుపత్రుల్లో ఐవీఎఫ్ సేవలు పీపీపీ విధానంలో అందిస్తాం. సిజేరియన్లు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం 8.8 శాతం ఉన్న టీనేజ్ గర్భధారణలను 3 శాతం లోపు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 50 మంది చిన్నారులు, మహిళలు ఒక ప్రాంతంలో ఉంటే చైల్డ్‌కేర్ సెంటర్లు, పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తాం. షి క్యాబ్‌లు అందుబాటులోకి తెస్తాం. విశాఖపట్నంలో రూ.172 కోట్లతో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణం చేపట్టాం. ఏ ప్రాంతంలో మహిళా ఉద్యోగులు పనిచేస్తారో అక్కడ కొత్తగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మూడో సంతానం, ఆపై జననాలకు 12 నెలల పేరెంటల్ లీవ్, తండ్రులకు 2 నెలలు పెటర్నల్ లీవ్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాం. మూడో సంతానానికి ‘పోషణ-శిక్షా-సురక్ష’ ప్యాకేజ్ ఇస్తాం. మూడో సంతానానికి డెలివరీ సమయంలో రూ.25,000 ప్రోత్సాహకంగా ఇవ్వడంతో పాటు ఐదేళ్ల పాటు నెలకు పోషణ కింద రూ.1,000 సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తాం. త్వరలో ‘తల్లిదండ్రుల సమాన బాధ్యత’ పేరుతో కుటుంబ బాధ్యతలు పంచుకోవడంపై అవగాహన ప్రచారం చేపడతాం. పిల్లల సంరక్షకులకు (చైల్డ్ కేర్‌టేకర్లు) ప్రత్యేక శిక్షణ ఇస్తాం’ అని సీఎం వివరించారు.
సభ్యుల అభిప్రాయాలపై స్పందించిన సీఎం
పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ ప్రకటనపై శాసనసభలో సభ్యులు వెల్లడించిన అభిప్రాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. మాల్తూషియన్ థియరీ ఆఫ్ పాపులేషన్‌పై గతంలో విస్తృత చర్చ జరిగేదని, ప్రకృతి విపత్తులు, మహమ్మారులు వస్తే జనాభా నియంత్రణ జరుగుతుందని ఈ థియరీని ప్రతిపాదించినట్టు సీఎం చెప్పారు. 1996-97 సమయంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కోసం బ్రేక్ సైలెన్స్ అంటూ ప్రచారాలు నిర్వహించామని, దాంతో రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణ సాధ్యమైందన్నారు. అలాగే, ఆర్థిక సంస్కరణలు, సెల్‌ఫోన్ లాంటి టెక్నాలజీ విప్లవం, కుటుంబ నియంత్రణ లాంటి అంశాలు ఎన్నో అమలు చేసి విజయం సాధించామన్నారు. మొదట్లో జనాభా నిర్వహణ గురించి మాట్లాడితే కొందరు విమర్శించారని, ఇప్ప్పుడు అంతా దాని గురించే మాట్లాడుతున్నారని చెప్పారు. దక్షిణ భారతదేశంలో జనాభా క్షీణత నమోదవుతోందని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారత రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. ఇప్ప్పుడు ఒక్కరు వద్దు, ఇద్దరు ఒకే, ముగ్గురు ముద్దు అనే నినాదం తీసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు.
ప్రజాభిప్రాయం మేరకే తుది పాలసీ
‘ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో సమాజంలో జీవితాలు అన్నీ యాంత్రికంగా మారిపోయాయి. యాంత్రిక జీవితంతోనే మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఏపీ జనాభా 5 కోట్లకు తగ్గకుండా నిర్వహిస్తేనే తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా నిలుస్తుంది. ప్రజాహితం కోసం, ఆర్థిక అసమానతలను తొలగించేలా నిర్ణయాలు తీసుకుందాం. అత్యున్నత జీవన ప్రమాణాల కోసం పునాది వేయబట్టే హైదరాబాద్ ఇప్ప్పుడు అత్యుత్తమ నగరంగా ఎదిగింది. ఇప్ప్పుడు ప్రణాళికలు చేస్తేనే వచ్చే 30 నుంచి 40 ఏళ్లలో సమాజంలో సుస్థిరత, సంపద, సమృద్ధి చేకూరతాయి. పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై ప్రజాభిప్రాయం ఆధారంగా ముందుకు వెళ్తాం. ఈ పాలసీపై చట్టసభలో తీసుకున్న ఈ సంకల్పం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రజలు కూడా ఈ సంకల్పాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలి’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.


