
పశ్చాత్తాపం చెందాల్సిందే
. అమెరికా-ఇజ్రాయిల్‌కు ఇరాన్ హెచ్చరిక
. ప్రాణనష్టం కలిగిస్తారా?
. ప్రతి హత్యకు గుణపాఠం చెబుతాం: అరాగ్చీ
. 1,230కు పెరిగిన మతులు
. 120 గంటలు దాటిన ఇంటర్నెట్ బ్లాకౌట్
తెహ్రాన్: పశ్చిమాసియా పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం ప్రపంచ దేశాల్లో ఉంది. అమెరికా`ఇజ్రాయిల్ కలిసికట్టుగా ఇరాన్‌పై భీకర దాడులు సాగిస్తుండగా… ఇరాన్ కూడా సమర్థంగా ప్రతిదాడులు చేస్తోంది. ప్రతీకారం తీర్చుకుంటోంది. అమెరికాకు అండగా నిలిచిన ఆయా దేశాల స్థావరాలను, సైనిక శక్తిని దెబ్బతీస్తున్నది. గల్ఫ్ పరిధి సైనిక స్థావరాలను ధ్వంసం చేస్తున్నది. ఈ యుద్ధం గురువారానికి ఆరవ రోజుకు చేరుకుంది. పరస్పర దాడులతో భయానక వాతావరణం నెలకొన్నది. యుద్ధం కారణంగా ఇరాన్ ఇప్పటికే ఇంటర్నెట్ కనెక్టివిటీని కోల్పోయింది. ఇంటర్నెట్ బ్లాకౌట్ 120 గంటలకుపైగా కొనసాగినట్లు ఎక్స్‌లో నెట్‌బ్లాక్స్ (ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ) పేర్కొంది. ఫిబ్రవరి 28 నుంచి జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 1230 మంది ఇరాన్ ప్రజలు మరణించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పటివరకు ఐదు వేల బాంబులతో ఇరాన్‌పై తమ సైన్యం దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. తమ దేశంలో పాలన మార్పునకు ప్రయత్నిస్తే డిమోనా అణు కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని ఇజ్రాయిల్‌ను ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు ఈ యుద్ధం హిందూ మహాసముద్రం దరి చేరడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ ఆహ్వానం మేరకు సైనిక విన్యాసాల్లో పాల్గొనేందుకు వెళ్లి వస్తున్న నౌకపై అమెరికా టార్పెడోతో దాడి చేసి వంద మందికిపైగా నేవీ సిబ్బందిని హతమార్చడంపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఉద్దేశపూర్వకంగానే నివాస ప్రాంతాలు, పౌరులను అమెరికాఇజ్రాయిల్ లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆరోపించింది. ఇలాంటి చర్యలకు అమెరికాకు పశ్చాత్తాపం తప్పదని, తమ వాళ్ల హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ‘ఎలాంటి కవ్వింపులు లేకుండా, రెచ్చగొట్టకుండా ఇస్లామిక్ రిపబ్లిక్‌పై ఈ తరహా దాడులు చేయడం యుద్ధం కంటే ఘోరం. దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. చమురు ధరలు పెరిగిపోయాయి. కరెన్సీలు అస్థిరమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సామాన్యుý కొనుగోలు శక్తి దెబ్బతిన్నది. ఇరాన్ ప్రజలు చెల్లించుకునే మూల్యం చాలా ఎక్కువ. మా ప్రజలు దారుణ హత్యలకు గురవుతున్నారు. భీతావహ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రజా క్షేత్రాలే లక్ష్యంగా దాడులు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి. ఎక్కడైతే ఎక్కువ ప్రాణనష్టం జరుగుతుందని వారు అనుకుంటారో అక్కడే దాడులు చేస్తున్నారు’ అంటూ ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఎక్స్ మాధ్యమంగా తీవ్రస్థాయిలో ఆవేదన వెళ్లగక్కారు. అమెరికాఇజ్రాయిల్ దుశ్చర్యలను ఎండగట్టారు. ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని, పశ్చాతాపంతో మునిగిపోతారని హెచ్చరించారు. ఇదిలావుంటే, తమ ఆపరేషన్ మరో రెండు వారాలు కొనసాగుతుందని ఇజ్రాయిల్ ప్రకటించిన వేళ ఆ దేశ ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం కోసం వారానికి మూడు బిలియన్ డాలర్ల మేర ఖర్చు భరించాల్సి వస్తున్నదని, ఆర్థిక వ్యవస్థ స్తంభించిన వేళ ఇది నష్టాలకు దారితీస్తుందని పేర్కొంది. హెజ్బుల్లా అంతం నెపంతో లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోంది. అక్కడి అనేక ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ హెచ్చరించింది. ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు తరలిపోతుండటం లెబనాన్‌లో కనిపించింది. తాజా పరిణామాల క్రమంలో తమ దేశంలో ఇరాన్ గార్డ్స్ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా లెబనాన్ నిషేధం విధించింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే శిక్షలు తప్పబోవని హెచ్చరించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా ఎదుర్కొన్నాయని, తమకు నష్టం జరగలేదని ఇజ్రాయిల్ ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతమైన దహియేను ఖాళీ చేయాలని లక్షల మందికి ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరికలు చేసింది. ‘ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండి. మీ ప్రాణాలు కాపాడుకోండి’ అంటూ అరబిక్ భాషలో ఎక్స్ మాధ్యమంగా హెచ్చరించింది. తెహ్రాన్‌పై ‘ట్వెల్త్ వేవ’ దాడులు పూర్తి అయినట్లు ఐడీఎఫ్ ఒక ప్రకటన చేసింది. అల్బోర్జ్ ప్రావిన్స్‌లోని ఇరాన్ కేంద్ర కార్యాలయాలు, తెహ్రాన్‌లోని బసిజ్ దళాల స్థావరంపై దాడి చేసినట్లు పేర్కొంది.
ఇరాన్ భూగర్భ క్షిపణి క్షేత్రాలపై దాడుల వ్యూహం
ఇరాన్లో ఇజ్రాయిల్ యుద్ధం రెండవ దశలోకి ప్రవేశిస్తోంది. భూగర్భ బాలిస్టిక్ క్షిపణి క్షేత్రాలు లక్ష్యంగా ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు భీకర దాడులు చేయబోతున్నాయి. ఇందుకు ఇజ్రాయిల్ సైన్యం వ్యూహాలు సిద్ధం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. తమ దేశం లక్ష్యంగా దాడులకు ఆస్కారం ఉన్నట్లు భావించి, కొన్ని వందల ఇరాన్ క్షిపణి ప్రయోగ స్థలాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. రెండవ దశ పోరులో బాలిస్టిక్ క్షిపణులు, పరికరాలు నిల్వ చేసిన బంకర్లను లక్ష్యంగా చేసుకోనున్నుట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అజర్బైజన్పై డ్రోన్ దాడి చేయలేదు: ఇరాన్
అజర్బైజన్పై ఇరాన్ రెండు డ్రోన్లతో దాడి చేసిందని, ఈ దాడుల్లో ఇద్దరు గాయపడ్డారని బకు ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ సాయుధ దశాలు అజర్బైజన్పై డ్రోన్ దాడి చేయలేదని పేర్కొంది. ముస్లిం దేశాల మధ్య సంబంధాలను చెడగొట్టేందుకు జియోనిస్టులు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది. అయితే తమపై జరిగిన దాడికి ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని అజర్బైజన్ ప్రకటించింది. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం, పౌరుల భద్రత, ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకుంటామని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. ఈ దాడికి ఇరాన్ సమాధానం చెప్పాల్సిందేనని పేర్కొంది. ఇదే క్రమంలో తమ దేశానికి ఇరాన్ రాయబారికి అజర్బైజన్ సమన్లు జారీచేసింది.
అధినేతను ఎన్నుకోలేదు: ఉన్నతాధికారి
ఖామేనీ హత్య క్రమంలో నూతన అధినేతను ఇరాన్ ఇంత వరకు ఎన్నుకోలేదని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నాయకుడి ఎన్నిక కసరత్తు కొనసాగుతోందని భారత్‌లో ఇరాన్ అధినేతకు ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమిలాహీ తెలిపారు. కౌన్సిల్ ఇప్పటివరకు ఎవరిని ఎంపిక చేయలేదు అంటూ ఖామేనీ తనయుడు ముజ్తబాకు పగ్గాలు అప్పగించే వార్తలను తోసిపుచ్చారు.
యుద్ధంలో చిక్కుకున్న గల్ఫ్
తమ చుట్టుపక్కల దేశాల్లోని అమెరికా స్థావరాలను ఇరాన్ ధ్వంసం చేస్తుండటంతో గల్ఫ్ కూడా యుద్ధంలో చిక్కుకున్నట్లు అయింది. ఖతార్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అమెరికా ఎంబసీ చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించింది. గురువారం రాజధాని దోహాలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. క్షిపణులను సమర్థంగా అడ్డుకునేందుకు తమ సైన్యం ప్రయత్నిస్తున్నట్లు ఖతార్ రక్షణ శాఖ వెల్లడించింది. గగనతల రక్షణ వ్యవస్థలు క్షిపణులను అడ్డుకుంటున్నట్లు తెలిపింది. యూఏఈ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్ప్పుకొచ్చింది. తమపైకి వచ్చిన డ్రోన్‌ను సమర్థంగా ధ్వంసం చేసినట్లు తెలిపింది. డ్రోన్ శిథిలాలు పడి అబూదాబీలో ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో పాకిస్థాన్, నేపాల్ పౌరులు ఉన్నట్లు అబుదాబీ మీడియా కార్యాలయం వెల్లడించింది. కాగా, అవసరమైతే గల్ఫ్‌కు ఆయుధ సాయం చేస్తామని ఇటలీ ప్రకటించింది.
ఇరాన్ జెట్‌ను కూల్చేసిన ఎఫ్-35
ఇరాన్‌కు చెందిన యాక్-130 యుద్ధ విమానాన్ని ఇజ్రాయిల్‌కు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానం కూల్చివేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. సంబంధిత వీడియో విడుదల చేసింది. ఎఫ్-35 యుద్ధ విమానం మరో మానవసహిత యుద్ధ విమానాన్ని కూల్చడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గడిచిన 40 ఏళ్లలో తొలిసారి ఇజ్రాయిల్ మానవసహిత గగనతలం నుంచి గగనతలంలో జరిగే యుద్ధంలో పాల్గొన్నాయి. 1985 నవంబర్ 24న చివరిసారి లెబనాన్ గగనతలంలో శత్రు విమానాన్ని ఇజ్రాయిల్ కూల్చింది. అప్పట్లో సిరియాకు చెందిన మిగ్-23 విమానాలను ఐఏఎఫ్ ఎఫ్-15 నేలకూల్చింది.
అమెరికా అణు క్షిపణి పరీక్ష
పశ్చిమాసియాలో యుద్ధం వేళ అమెరికా అత్యంత శక్తిమంతమైన ఖండాంతర అణు క్షిపణిని పరీక్షించింది. కాలిఫోర్నియా తీరంలోని వాండెన్‌బర్గ్ స్పేస్‌ఫోర్స్ బేస్ నుంచి మినిట్‌మ్యాన్-3 బాలిస్టిక్ మిస్సైల్‌ను అమెరికా ఎయిర్‌ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ ప్రయోగించింది. మార్షల్ ఐలాండ్స్‌లో నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ క్షిపణి సమర్థంగా ఛేదించినట్లు యూఎస్ స్పేస్‌ఫోర్స్ వెల్లడించింది. పరీక్ష విజయవంతమైందని ప్రకటించింది. మినిట్‌మ్యాన్-3లో అత్యంత శక్తిమంతమైన మార్క్-21 రీఎంట్రీ వెహికల్. న్యూక్లియర్ పేలోడ్‌ను ఇందులో అమర్చవచ్చు. జపాన్‌లోని హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే 20 రెట్లు శక్తిమంతమైన అణు వార్హెడ్లను ఇది మోసుకెళ్లగలదు. ఈ క్షిపణి గంటకు 15 వేల మైళ్ల వేగంతో ఆరు వేల మైళ్ల దూరం ప్రయాణించగలదు. ప్రయోగించిన కొన్ని నిమిషాల్లోనే లక్ష్యాన్ని ఛేదించగలదు.
శాంతి కోసం 12 దేశాల రాయబారం
ఇరాన్ గతంలో యురేనియం సుసంపన్నతను తగ్గించడం గురించి మాత్రమే మాట్లాడేది. కానీ, ఇప్ప్పుడు అణు కార్యక్రమం మొత్తాన్ని రద్దు చేస్తామని ప్రతిపాదించింది. ఈ క్రమంలో ఉద్రిక్తతలు తగ్గించి, ఒప్పందం కోసం 12 పశ్చిమాసియా దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ చర్చలకు టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్ నాయకత్వం వహిస్తున్నారు. ఒమన్, సౌదీ అరేబియా కూడా అమెరికాపై ఒత్తిడి తెస్తూ, ఇరాన్‌తో ఒప్పందం కుదిరేలా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాఇరాన్ ప్రతినిధులు జెనీవా, ఒమన్‌లో రహస్యంగా భేటీ అయ్యారని సమాచారం. ఇరాన్- అమెరికా మధ్య చారిత్రక ఒప్పందం కోసం చర్చల్లో ఇరాన్ తరపున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, సహా మంత్రి ఖతీబ్జాదే... అమెరికా తరపున స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ పాల్గొంటున్నారు. అమెరికాఇజ్రాయిల్ భీకర దాడుల తరుణంలో ఇరాన్ ఈ ప్రతిపాదన చేయడం గమనార్హం. అమెరికా అంగీకరిస్తే శాంతికి అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇందుకు అమెరికా పెట్టే షరతులపైనే ఈ ఒప్పంద భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


