న్యూదిల్లీ: ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ భయాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. దేశీయ కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోవడంతో సామాన్యుల నుంచి ఇన్వెస్టర్ల వరకు అందరిలోనూ ఆందోళన మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో క్షీణించింది. చరిత్రలో మొదటిసారిగా రూపాయి విలువ 92 మార్కును దాటి పడిపోయింది. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా యుద్ధ పరిస్థితుల ప్రభావం దలాల్ స్ట్రీట్‌పై తీవ్రంగా పడింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీలు భారీగా పతనమయ్యాయి. కేవలం ఒక్క రోజు లావాదేవీల్లోనే ఇన్వెస్టర్లకు సంబంధించిన దాదాపు రూ. 9.7 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య యుద్ధం సంభవిస్తే ప్రపంచ సరఫరా గొలుసు దెబ్బతిం టుందనే భయం మార్కెట్లను వెంటాడు తోంది. ముఖ్యంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగితే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం మోపుతుంది. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ధరలు కూడా ఈ ఉద్రిక్తతల వల్ల భారీగా పెరిగే అవకాశం ఉంది.


