కాంగ్రెస్ పెద్దల అక్రమాలు కనబడడం లేదా? హరీశ్‌రావు
విశాలాంధ్ర – హైదరాబాద్ : పేదల ఇళ్లను కూల్చిన రేవంత్ సర్కార్‌కు కాంగ్రెస్ పెద్దలు హైదరాబాద్ నడిబొడ్డున కొండలను పిండి చేస్తుంటే కనిపిండం లేదా అని బీఆరఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాల పై ఎక్స్ వేదికగా ఆయన ధ్వజమెత్తారు. రాజేంద్రనగర్ మానస హిల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి పొంగులేటి సంస్థ ‘రాఘవ కన్స్ట్రక్షన్స’ కొండలను పిండి చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ అల్లుడి అనుయాయులకు ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17ఎకరాల ప్రభుత్వ భూమి కట్టబెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూల్చే హైడ్రాకు… మంత్రులు, వాళ్ల బంధువులు చేస్తున్న అక్రమ క్వారీలు, భూకబ్జాలు ఎందుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొడుతుంటే రెవెన్యూ, మైనింగ్, పీసీబీ, హెచఎండీఏ అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడటం లేదని నిలదీశారు. మంత్రు భట్టి విక్రమార్క, కొండా సురేఖ, వివేక్ సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తుందని మండిపడ్డారు. విజిలెన్స్ విభాగాలు పని చేయడం లేదా అని మండిపడ్డారు. అక్రమంగా క్వారీ నిర్వహిస్తూ కొండలను మాయం చేస్తూ భారీ స్థాయిలో రాళ్లు, కాంక్రీటు తరలించడం చట్టవిరుద్ధం అనే విషయం తెలియదా అన్నారు. ప్రభుత్వ భూములు రక్షించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులే భూ బకాసురులుగా మారితే వాటిని రక్షించే వారెవరన్నారు. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని గొప్పలు చెప్పడమే తప్ప ప్రభుత్వ ఆస్తిని మంత్రి కంపెనీ అప్పనంగా తన్నుకు పోతుంటే ఎందుకు కాపాడడం లేదన్నారు. ముఖ్యమంత్రి అల్లుడి అనుయాయులు, మంత్రి పొంగులేటి సంస్థ నిర్వహిస్తున్న అక్రమ క్వారీ ఫొటోలు మీడియా సాక్షిగా విడుదల చేశారు.


