99 రోజుల కార్యక్రమాల్లో ‘స్థానిక’ పాలకులను భాగస్వాముల్ని చేయండి


u శిక్షణలో విధులు, బాధ్యతలపై అవగాహన
. సోలార్ విద్యుత్ వినియోగానికి ప్రోత్సాహం
. ప్రజలకు వైద్య కళాశాలల సేవలు
. పంటల మార్పిడి ప్రయోజనాన్ని రైతన్నకు వివరించండి
. కలెక్టర్ల సదస్సులో రేవంత్

విశాలాంధ్ర – హైదరాబాద్ : ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యక్రమాల్లో పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. వీరందరికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. విధులు, బాధ్యతలకు సంబంధించి వారికి అవగాహన కల్పించడంతో పాటు ప్రింటెడ్ మెటీరియల్ అందించాలని కోరారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ పంప్ సెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలని, ఇళ్లపై సోలార్ ప్లాంట్లు అమర్చుకోవడం, సోలార్ విద్యుత్ వాడుకోవటంతో పాటు గ్రిడ్ కు అనుసంధానించడం ద్వారా వచ్చే ఆదాయంపై అన్ని గ్రామాల్లో విద్యుత్ శాఖ అవగాహన కల్పించాలన్నారు. నూతనంగా ఇచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో చేకూరిన లబ్ధిని ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలో 35 ప్రభుత్వ మెడికల్ కళాశాలల సేవలు ప్రజలకు అందేలా చూడాలని ఆదేశించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఇతర స్థానిక వైద్య సంస్థలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకే రిఫర్ చేయాలని, మెడికల్ కళాశాలల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, వైద్య విద్యార్థులు, వైద్యులు, ప్రొఫెసర్ల సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. లబ్ధిదారుల ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నైజేషన్) చేపట్టాలని స్పష్టం చేశారు. ఆసరా పింఛన్లలో ముఖ గుర్తింపు చేపట్టడంతో మూడు లక్షల మంది అనర్హుల పేర్లు తొలగించగలిగామని, సాంకేతికతను సరిగా వినియోగించుకోకపోవడంతోనే ఇంత పెద్ద సంఖ్యలో అనుచిత లబ్ధి పొందారన్నారు. రవాణా శాఖ డాటా ఆన్‌లైన్ పూర్తి చేయాలని, పాఠశాలలు బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర సరకు రవాణా వాహనాల డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రహదారులపై గుంతలు, ప్రమాద స్థలాల వివరాలు తెలుసుకునేందుకు వాట్సాప్ నెంబర్‌ను రవాణా శాఖ ఇవ్వాలని సూచించారు. ఓఆరఆర్, ఓఆరఆర్ సర్వీసు రోడ్ల వెంట భారీగా చెత్త, ఇతర నిర్మాణ వ్యర్థాలు డంప్ చేస్తున్నారని, వాటిని తరలించే వాహనాలను పట్టుకొని జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులు చెల్లించాలని సూచించారు. పిల్లలకు పోషకాహారం అందాలి, అందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, డ్రగ్స్, ఈ-సిగరెట్ల వినియోగం జరిగితే అందుకు ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాలన్నారు. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల, కళాశాలల్లో సబ్జెక్ట్ టీచర్స్, పీఈటీ ఎలా ఉంటారో అలానే సైకాలజిస్ట్ ఉండేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ భూసార పరీక్షలు చేపట్టి సకాలంలో రైతులకు వాటి సమాచారం అందజేయాలి, ఏ భూమిలో ఏ పంట బాగా పండుతుంది అనే విషయం రైతులకు తెలియజేయడంతో పాటు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేలా అన్నదాతలను ప్రోత్సహించాలన్నారు. పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రయోజనాలను వివరించాలన్నారు. యూరియా యాప్‌లో కొంత గందరగోళం ఉన్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారని, దానిని సులువుగా వినియోగించేలా మార్పులు చేయాలన్నారు. నానో యూరియా ఉపయోగాలను క్షేత్రస్థాయిలో ప్రదర్శన ద్వారా రైతులకు చూపించాలని తెలిపారు. పంటలు మొదలు పంట ఉత్పత్తుల అమ్మకం వరకు సరైన కార్యాచరణ ప్రణాళిక ఉంటేనే ఇబ్బందులు ఎదురుకావన్నారు. ఈ విషయంలో ఈ రెండు శాఖలు పరస్పర సహకారంతో ముందుకుసాగాలని సూచించారు. కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో పంటల వైవిధ్యతకు ఉన్న అవకాశాలపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.
6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక
ప్రభుత్వం ఈ నెల ఆరో తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అనే పేరుతో 99రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఐదు దశల్లో దీన్ని చేపట్టనున్నారు. దీనికి ప్రణాళిక శాఖ ఈ కార్యక్రమానికి నోడల్ శాఖగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగా ఏప్రిల్ రెండోతేదీన గ్రామ సభల నిర్వహణ, 16న మండల స్థాయి, మే రెండో తేదీన నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 22న జిల్లా స్థాయి, జూన్ రెండో తేదీన రాష్ట్ర ఆవిర్భావ వేడుక చేపడతారు. శాఖల వారీగా 10 థీమ్‌లతో చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. అందులో భాగంగా పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్… అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్ కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం పై దృష్టి సారించనున్నారు. ఈ నెల ఆరోతేదీన అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రులు సన్నాహక సమావేశాలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్ ను రూపొందించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చిన్నా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *