తగ్గని ఇరాన్ – Visalaandhra


. క్షిపణులు, డ్రోన్లతో విధ్వంసం
. హెచ్చరికలు బేఖాతరు
. ప్రతీకారంతో ముందుకు…
. అమెరికాతో చర్చకు ససేమిరా
. గల్ఫ్ బాంబుల మోత

తెహ్రాన్: ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా, ఇజ్రాయిల్ సైనిక, చమురు స్థావరాలు లక్ష్యంగా దాడులు చేస్తోంది. అధినేత ఖామేనీని
కోల్పోయినప్పటికీ వెన్నుచూపని యోధుడివలే యుద్ధంలో ముందుకెళుతోంది. అమెరికా-ఇజ్రాయిల్ ఏకపక్షంగా విరుచుకుపడుతున్నా, గల్ఫ్
దేశాలు ఏకాకిని చేసినా తనదైన పంథాలో దూసుకుపోతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా క్షిపణులు ప్రయోగిస్తోంది. చమురు రవాణా నౌకలను ధ్వంసం చేస్తోంది. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయిల్ ఆస్తులు లక్ష్యంగా విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్ ప్రధాని
బెంజిమిన్ నెతన్యాహు కార్యాలయంపై క్షిపణిలు ప్రయోగించింది. అయితే, దీనిని ఇజ్రాయిల్ ఖండించింది. అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్- హెజ్బుల్లా దాడులతో పశ్చిమాసియా వణికిపోతోంది. అమెరికా-ఇజ్రాయిల్ విస్తృత స్థాయిలో దాడులు కొనసాగిస్తున్నా ఇరాన్ దీటుగా
బదులిస్తోంది. సోమవారానికి యుద్ధం మూడో రోజుకు చేరుకుంది. దీంతో బాంబు దాడులతో పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. తమ అధినేత చావుకు ప్రతీకారం తీర్చుకునే పట్టుదలతో ఇరాన్ సోమవారం క్షిపణులు, డ్రోన్లతో ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది. అమెరికాకు
మద్దతిస్తున్న దేశాలు, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు లక్ష్యంగా దాడులు కొనసాగించింది. రాజీ ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. అమెరికాతో చర్చలకు ఇరాన్ నిరాకరించింది. గల్ఫ్ దేశాలన్ని ఒక్కటై ఇరాన్ ను ఏకాకి చేసినప్పటికీ పట్టువిడవని విక్రమార్కుడు చందంగా తెహ్రాన్
ముందుకెళుతోంది. దాడులు ఆపకపోతే చావుదెబ్బ తప్పదని అమెరికా చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, తమ సార్వభౌమత్వం, పౌరుల రక్షణే ప్రథమమని ఇరాన్ స్పష్టంచేసింది. అధినేత మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడించింది. దీంతో పశ్చిమాసియా
పరిణామాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. కొన్ని దేశాలు అమెరికా-ఇజ్రాయిల్ వైఖరిని ఖండించగా, మరికొన్ని సమర్థిం చాయి. చైనా, రష్యా, ఉత్తర కొరియా వంటి ప్రధాన దేశాలు అమెరికా-ఇజ్రాయిల్ చర్యలను ఆక్షేపించాయి. రాజకీయ హత్యలకు పాల్పడటం
సరికాదని రష్యా పేర్కొంది. అమెరికాకు జర్మనీ మద్దతిచ్చింది. ఇరాన్ దాడుల్ని ఆపకపోతే అమెరికాతో కలిసి కదన రంగంలోకి దిగేందుకు సిద్ధమని తెలిపింది. ఫ్రాన్స్, బ్రిటన్ కూడా ఇరాన్కు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాయి. తమ దేశాల ప్రయోజనాలు కాపాడుకునేందుకు, గల్ఫ్
మిత్రుల రక్షణకు ఇరాన్పై పోరాటానికి వెనుకాడబోమని వెల్లడించాయి. సైప్రస్లోని బ్రిటన్ వైమానిక స్థావరంపైనా ఇరాన్ దాడిచేసింది.
ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారుల మృతి
ఇజ్రాయిల్ చేపట్టిన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’లో భాగంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు లక్ష్యంగా దాడులు జరిపినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. తెహ్రాన్లోని శాఖ ప్రధాన కార్యాలయంపై దాడి చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ డిప్యూటీ
ఇంటెలిజెన్స్ మంత్రి సయ్యద్ యాహ్యా హమీది, గూఢచర్య విభాగాధిపతి జలాల్ పుర్ హుస్సేన్ మరణించినట్లు పేర్కొంది. ప్రాంతీయ భద్రత, పౌరుల రక్షణ దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. యుద్ధంలో ఇప్పటివరకు 555 మంది మరణించినట్లు ఇరాన్ వర్గాలు
వెల్లడించాయి. ఈ దాడులతో 131 నగరాలు ప్రభావితమైనట్లు తెలిపాయి. అమెరికా ముగ్గురు సైనికులను కోల్పోగా, ఇజ్రాయిల్లో 11 మరణాలు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది ఆరంభమేనని, మరో నాలుగు, ఐదు వారాలు విస్తృత స్థాయిలో సైనిక చర్యలు
కొనసాగుతాయని అమెరికా ప్రకటించింది. తమ సైనికుల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది. హెజ్బుల్లా సైతం రంగంలోకి దిగడంతో ఇజ్రాయిల్ మరింతగా రెచ్చిపోయింది. ఇజ్రాయిల్పై హెజ్బుల్లా క్షిపణి దాడులు చేయడానికి బదులుగా లెబనాన్ పై ఇజ్రాయిల్
సైన్యం ప్రతి దాడులు భీకరంగా సాగింది. ఫలితంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో మార్షల్ దీవులకు చెందిన ఆయిల్ ట్యాంకర్పై డ్రోన్ బాంబు దాడి జరిగింది. నౌకలో పనిచేసే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దాడికి గురైన నౌకను ఎంకేడీ వ్యోమ్గా
గుర్తించిన ఒమన్… మృతుడు భారతీయుడని తెలిపింది.
సౌదీ, ఖతార్ చమురు క్షేత్రాలపై దాడులు: సౌదీ అరేబియాలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ‘అరామ్కో”పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. రాస్ తనురాపై దాడితో ఈ ప్రాంతంలోని ఇంధన మౌలిక సదుపాయాలకు తీవ్ర అంతరాయం
కలిగింది. అరాంకో రాస్ తనురాను లక్ష్యంగా ప్రయోగించిన రెండు డ్రోన్లను కూల్చినట్టు సౌదీ రక్షణశాఖ ప్రతినిధి అల్ అరేబియా తెలిపారు.
ఈ రిఫైనరీలో రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి అవుతుంది. దాడి తర్వాత భారీగా మంటలు చెలరేగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అలాగే ఖతార్ ని రాస్ లఫన్ చమురు క్షేత్రం, పవర్ ప్లాంట్పైనా ఇరాన్ రెండు డ్రోన్లు
ప్రయోగించినట్లు ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. ఖతార్ ఎనర్జీకి చెందిన రాస్ లఫన్ ఇండస్ట్రియల్ సిటీలోని చమురు క్షేత్రం లక్ష్యంగా ఒక డ్రోనును ఇరాన్ ప్రయోగించిందని, మరొక డ్రోను మసయీద్లోని పవర్ ప్లాంట్కు సంబంధించిన వాటర్ ట్యాంక్ను లక్ష్యంగా చేసుకున్నదని
రక్షణ శాఖ వెల్లడించింది. ప్రాణ నష్టం జరిగిన దాఖలు లేవని ప్రకటన పేర్కొంది.
ఈయూ ఖండన ఇరాన్ దాడులపై యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వన్ డెర్ లేయాన్ మండిపడ్డారు. పశ్చిమాసియాలోని సౌర్వభౌమాధికార ప్రాంతాలపై
ఇరాన్ బాధ్యతారహితంగా దాడులకు పాల్పడుతున్నాయన్నారు. సైప్రస్లోని బ్రిటన్ వైమానిక స్థావరం, సౌదీ అరేబియా, ఖతార్ చమురు క్షేత్రాలపై దాడులను ఖండించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు పనిచేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియా సుస్థిరత అత్యంత
కీలకమని ఉర్సులా అన్నారు.
హెజ్బుల్లా అధినేతకు ఖామేనీ గతే: ఇజ్రాయిల్ కట్జ్
హెజ్బుల్లా అధినేత నయీం ఖాసీంకు ఖామేనీ గతే పడుతుందని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ హెచ్చరించారు. ‘హెజ్బుల్లా సంస్థను, హెజ్బుల్లా ఉగ్ర సంస్థచైర్మన్ నయీం ఖాసీంను తీవ్రంగా దెబ్బతీస్తాం. ఖామేనీ అడుగుజాడల్లో నడిచే వారందరినీ గుర్తిస్తాం.
వారందరినీ ఆయనకు పట్టిన గతే పట్టిస్తాం’ అని కట్జ్ అన్నారు. తమ దేశంపై హెజ్బుల్లా దాడులకు ప్రతీకారంగా లెబనాన్లోని హెజ్బుల్లా
కీలక నేతల కార్యాలయాలపై, ఆ సంస్థ స్థావరాలపై దాడులు చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఈ దాడుల్లో హెజ్బుల్లా కీలక నాయకుడు, లెబనాన్పా ర్లమెంటు సభ్యుడు మహమ్మద్ రాద్ మరణించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇంకొందరు ఉన్నతాధికారులు కూడా చనిపోయినట్లు ఐడీఎఫ్
వర్గాలు వెల్లడించాయి. దాడులకు ముందు లెబనాన్లోని 50 గ్రామాలు ఖాళీ చేయాలని ఐడీఎఫ్ ముందస్తు ఆదేశాలిచ్చింది.
10 ఇంటర్ సెప్టార్ రాకెట్లను తప్పించుకొని….
ఇరాన్కు చెందిన ఓ క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని అత్యంత సమర్థంగా ధ్వంసం చేసింది. సుమారు 10 ఇంటర్సెప్టార్ రాకెట్లు అడ్డుకునే ప్రయత్నం
చేసినప్పటికీ, వాటిని తప్పించుకుని అనుకున్న పని చేసింది. జెరుసలాంలోని ఈ వీడియో వైరలైంది. ఓ ఇంటిపై కప్పు నుంచి ఈ వీడియ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో ‘ఓ మై గాడ్’ అని అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. అది ఫతాహ్ మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి
కావొచ్చన్న అంచనా ఉంది. ఫతాహ్-2 క్షిపణిని ఇరాన్ ఇటీవల నవీకరించింది. యుద్ధం నేపథ్యంలో ఆ ఆయుధాన్ని వాడినట్లు అనుమానిస్తున్నారు. ఫతాహ్-2 హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ తరహా వెళుతుంది. బాలిస్టిక్కు భిన్నంగా ఈ క్షిపణి ప్రయాణిస్తుంది. ఫతాహ్
క్షిపణితో ఇజ్రాయిల్ అంతం అవుతుందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ గతంలో పేర్కొన్నది.
నెతన్యాహు కార్యాలయం ధ్వంసం ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఇరాన్ గురి పెట్టింది. నెనత్యాహు కార్యాలయం, టెల్ అవీవ్, హైవా, తూర్పు జెరూసలేంలోని మరిన్ని లక్ష్యాలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సోమవారం ‘టెన్త్ వే’ పేరిట దాడులు చేసింది. వరుస పేలుళ్లతో జెలరూసలేం బాంబుల మోత మోగింది. ఈ దాడిలో నెతన్యాహు కార్యాలయం ధ్వంసమైంది. టెల్ అవీవ్లోని ప్రభుత్వ కార్యాలయాలపైనా ఇరాన్ విరుచుకుపడింది.
ఆపరేషర్ ట్రూప్ ప్రామిస్-4లో భాగంగా ఈ దాడులు చేసింది. నెతన్యాహు కార్యాలయంపై దాడి అనంతరం ఆయన పరిస్థితి ఏమిటో తెలియదంటూ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వ్యాఖ్యానించింది. ఇజ్రాయిల్ వైమానిక దళ కమాండర్ ఇల్లు, కార్యాలయంపైనా దాడులు చేసినట్లు
తెలిపింది. నెతన్యాహును ‘నేరపూరిత ప్రధాని’ (క్రిమినల్ పీఎం)గా ఇరాన్ అభివర్ణించింది. ‘జియోనిస్ట్ పాలనలో నేరస్థుడైన ప్రధానమంత్రి కార్యాలయం, వారి వైమానిక దళ కమాండర్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా చేసుకున్నాం’ అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడికి ఖేబర్ క్షిపణులను వాడినట్టు తెలిపింది. ఇరాన్ నుంచి ప్రయోగించిన కొత్త క్షిపణులను గుర్తించినట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించిన కొద్ది సేపటికే జెరూసలేంలో వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ‘కొద్దిసేపటి కిందట ఇరాన్ నుంచి ఇజ్రాయిల్ భూభాగం వైపు ప్రయోగించిన క్షిపణులను గుర్తించాం. రక్షణ వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తున్నాయి’ అని ఐడీఎఫ్ వెల్లడించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *