ద్విభాష్యం రాజేశ్వరరావు ఈ మధ్యలో అనేక మంది సాహితీవేత్తలతో పాటు అప్పుడప్పుడు కళారంగంలోని ఇతరులనూ పరిచయం చేస్తున్నారు. అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయి. వాటికి లిఖిత రూపం ఇచ్చి “విశాలాంధ్ర” పాఠకులకు అందజేయడం కోసం “నెమరు” శీర్షిక ప్రారంభిస్తున్నాం. ఈ పరిచయ వ్యాసాలు ప్రచురణ మొదలెట్టడానికి ముందు ద్విభాష్యం రాజేశ్వరరావు గురించి నాలుగు ముక్కలు…
ద్విభాష్యం 1945 జూలై ఒకటిన మునుపటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో జన్మించారు. ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖ పట్నంలో చదువుకున్నారు. మొదట మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పొంది ఆ తరవాత బి.ఎ. చదివి, స్నాతకోత్తర విద్య దగ్గరకొచ్చే సరికి పర్యావరణం గురించిన డిప్లొమా చేశారు. విశాఖ పట్నంలో కోరమండల్ ఇంటర్నేషనల్‌లో డిప్యూటీ మేనేజర్‌గా 23 ఏళ్ల కింద ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో విశ్రాంత జీవనం గడుపుతున్నానని చెప్తూ ఉంటారు. కానీ ఆయన సాహిత్య రంగంలో అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారు.
1959లో బాల మాసపత్రికలో ఆయన తొలి రచన అచ్చయింది. ఇంతవరకు 420 పై చిలుకు కథలు రాశారు. 14 నవలలు రాశారు. ఎనిమిది నాటికలు ప్రచురితమయ్యాయి. ఆరు కథా సంపుటాలు వెలుగు చూశాయి. వీటిలో 80 కథలు ఉన్నాయి. అందులో సగం కథలకు బహుమతులు వచ్చాయి. ఆకాశవాణిలో కథలు, నాటికలు, నాటకాలు, ప్రసంగాలు, రూపకాలు 130 కి పైగానే ప్రసారం అయ్యాయి. ఆయన రాసిన కథల్లో 60 ఇంగ్లీషు, కన్నడం, తమిళం, ఒరియా, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి.“శ్రమయేవ జయతే” పేరుతో 16 కథల సంపుటి హిందీలోకి అనువాదమైంది. “ఘర్ ఘర్ కి కహానీ పేరుతో మరో 40 అనువాద కథల సంపుటి త్వరలో వెలువడనుంది. ఆయన కథలు, నవలలను, సమగ్రసాహిత్యం మీద ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు ఎం.ఫిల్. పట్టా పొందితే ఒకరు పిహెచ్డి. పట్టా అందుకున్నారు. ఆయనచేసిన ఉద్యోగం పర్యావరణానికి సంబంధించింది కనక ఆ రంగంమీద “పారి శ్రామిక భద్రత, పర్యావరణ బాధ్యత” గ్రంథం రాశారు. ఇది పారిశ్రామిక కార్మికులకు భద్రత గురించి శిక్షణా కార్యక్రమంలో పాఠ్య పుస్తకంగా ఉపకరిస్తోంది. ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం పర్యావరణం మీద అవగాహన కల్పించడం కోసం రాసిన “పర్యావరణం” గ్రంథాన్ని జిల్లా కలెక్టర్ సాయంతో ప్రచురించారు. దీన్ని వివిధ ప్రాథమిక పాఠశాలల్లో ఉచితంగా అందజేశారు. ఇంత విస్తారమైన కృషి చేసిన వారికి అవార్డులకు ఏం కొదవ. 1981 లో ‘ఏ వెలుగులకీ ప్రస్థానం!’ నవలకు చక్రపాణి అవార్డు, 2007లో కూరెళ్ల సోమేశ్వరరావు సాహితీ పురస్కారం, 2015లో వేదగిరి కమ్యూనికేషన్స్వారి గురజాడ అవార్డు, 2016లో గణపతిరాజు అచ్యుతరామరాజు సాహితీ జీవనసాఫల్య పురస్కారం, 2016లో రాయనపాటి సాహితీపీఠం (విజయవాడ) వారి రాయనపాటి లక్ష్మీ కాంతారావు స్మారక సాహితీ పురస్కారం, 2016 కిన్నెర ఆర్ట్ థియేటర్స్ (హైదరాబాద్) వారి పానుగంటి లక్ష్మీనరసింహా రావు అవార్డు, 2017 లో బలివాడ కాంతారావు స్మారక సాహితీ పురస్కారం, 2019 లో రాచకొండ విశ్వనాథ శాస్త్రి సాహితీ పురస్కారం, 2020 లో ఘండికోట బ్రహ్మాజీరావు స్మారక సాహితీ పురస్కారం, 2023 లో దండెం రాజు ఫౌండేషన్ (బెంగుళూరు ) వారి ‘కథా భీష్మ’ పురస్కారం, 2024 లో గిడుగు రామ్మూర్తి పంతులు జాతీయ సాహితీ పురస్కారం, 2024 లో కిన్నెరా ఆర్ట్స్ థియేటర్స్ (హైదరాబాద్) అడవిబాపిరాజు సాహితీపురస్కారం, 2024 లో తటవర్తి భారతి సాహిత్య పురస్కారం మొదలైనవి లభించాయి. 2016 నుండి 2024 వరకు స్వాతి వార పత్రిక నిర్వహించిన కామెడీ కథల పోటీలలో, వరుసగా ఎనిమిది సార్లు పదివేల రూపాయల బహుమతులు పొందారు. అలాగే సాహస కథల పోటీలో వరసగా ఐదుసార్లు పదివేల రూపాయలు పొందారు.1987 లో ‘ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ సొసైటీ’ తరఫున సుమారు నెలరోజుల పాటు సోవియట్ రష్యాలో పర్యటించారు.1989 లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి ‘ట్రావెల్ గ్రాంట’ అవార్డుతో కర్ణాటక రాష్ట్రంలో నెలరోజుల పాటు పర్యటించి కన్నడ సాహితీవేత్తలను కలిసే అవకాశం ఆయనకు కలిగింది.
ప్రముఖ రచయితల గురించి ద్విభాష్యం వారి ముచ్చట్లు వచ్చే వారం నుంచి…
- – సం.
The post ద్విభాష్యం రాజేశ్వరరావు‘నెమరు’ appeared first on Visalaandhra.


