

. ఇప్పటివరకు 21 మంది కార్మికుల మృతి
. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి పదిమంది తరలింపు
. 50 మీటర్ల 60 మీటర్లు దూరంలో పడిన మృతదేహాలు
. మృతులలో మహిళలు
. భారీ శబ్దంతో ఉలిక్కిపడ్డ చుట్టుపక్క గ్రామాలు
. సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ
విశాలాంధ్ర – సామర్లకోట : సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ బానాసంచ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ భారీ పేలుడు ఘటనలో 21 మంది కార్మికులు ఇప్పటివరకు మృతి చెందినట్లు గుర్తించారు వీరిలో మహిళా కార్మికులు అధికంగానే ఉన్నారు. మృతదేహాలు గుత్తి పట్టలేని అంత దారుణంగా చల్లాచెదురుగా శరీర భాగాలు పడిపోయాయి. తీవ్ర గాయాలైన సుమారు 8 మందిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని అధికారులు అంటున్నారు. అయితే ఈ బాణాసంచా కేంద్రంలో ఎంతమంది పనిచేస్తున్నారనే సమాచారం ఎవరికి తెలియడం లేదు. బాణాసంచా కేంద్ర యజమాని కూడా దీంట్లో మరణించినట్టుగా చెబుతున్నారు ఈ పేలుడు ఘటన శనివారం మధ్యాహ్నం ఒంటి గంటన్నర రెండు గంటల సమయంలో సంభవించింది సుమారు మూడు షెడ్లు పూర్తిగా కనిపించకుండా పోయాయి. అక్కడ ఉన్నటువంటి వాహనాలు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ బాణాసంచా కేంద్రంలో సుమారు 50 మంది పైపడే పని చేస్తున్నారని అక్కడ ఉన్న కొద్దిమంది తెలియజేస్తున్నారు కొద్ది మంది భోజనం సమయానికి బయటికి వెళ్లారని ఎంతమంది ఉన్నారనేది చెప్పలేకపోతున్నారు ఈ పేలుడు దాటికి సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న గ్రామాలు లో భారీ శబ్దం వినిపించింది. దగ్గరలో ఉన్నటువంటి కట్టడాల అద్దాలు పగిలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటన జరిగిన ప్రాంతమంతా శవాలదిబ్బగా మారిపోయింది. చనిపోయిన వారిని ఇప్పటివరకు 15 మందిని గుర్తించినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఈ భారీ పేలుడకు పక్కనున్న వరిపొలాల్లో ప్రవహించే నీటి కాలంలో మృతదేహాలు పడిపోవడంతో వాటిని గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను ఎగరవేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తో పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి హుటాహుటిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఎస్పీ బిందు మాధవ్ చేరుకుని పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు పోలీసులు వైద్య సిబ్బంది రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. మృతదేహాలను మహాప్రస్థానం వాహనాల్లో ఆసుపత్రిలోకి తరలిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. రాత్రిపూట కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు ఆ ప్రాంతంలో అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు దీపావళి సందర్భాల్లో అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఇంత పెద్ద సంఘటన జరగడం అధికారుల పర్యవేక్షణ బాణాసంచా కేంద్రాలపై లేకపోవడమేనని నిల్వ ఉంచాల్సిన బాణాసంచా తయారీ కన్నా ఎక్కువ నిల్వ ఉంచడం వల్ల ఈ భారీ విష్పోటనం సంభవించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం పర్యటనలో ముగించుకుని హెలిపాడ్ ద్వారా సామర్లకోట చేరుకుని వేట్లపాలెంలోని సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి అధికారుల వద్ద సమాచారం తెలుసుకొని క్షేత్రగాత్రులను మృతుల బంధువులను పరామర్శిస్తున్నారు. సంఘటన స్థలానికి కూటమి నాయకులు, కాకినాడ పార్లమెంటు సభ్యుడు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ మంత్రి కందుల దుర్గేష్ డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తదితర బిజెపి నాయకులు సంఘటన స్థలాన్ని సందర్శించారు.


