అత్యంత అననుకూలమైన పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి మోదీ రెండు రోజుల పర్యటనకోసం బుధవారం ఇస్రాయెల్ పర్యటన ప్రారంభించారు. భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం అంతర్జాతీయ రంగంలో మోదీ పలుకుబడిని బాగా దెబ్బ తీసింది. సన్నిహిత మిత్రుడు అనుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోదీని ఖాతరు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ మధ్యవర్తిత్వంతో ట్రంప్‌కు దగ్గర కావాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. ఏ దేశ విదేశాంగ విధానమైనా తమ ప్రయోజనాల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ సంబంధాలు ఎంత బలమైనవి అన్న విషయం అనేక చారిత్రక పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. తీవ్రవాదులుంటారు. ఉగ్రవాదులుంటారు. కానీ ఒక దేశమే తీవ్రవాద దేశం కావడం ఒక్క ఇజ్రాయెల్‌కే సాధ్యమైంది. అలాంటి దేశంతో ప్రధానమంత్రి మోదీ రాసుకుపూసుకు తిరుగుతున్నారు. మారణ కాండకు పాల్పడుతూ పలస్తీనాపై విధ్వంసం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ ప్రధానితో మోదీ వియ్యం అందడం మన విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చేయడమే. విధ్వంసకులతో వియ్యం అందడమే. ఇది చారిత్రకంగా పలస్తీనా విషయంలో మనం అనుసరించిన విధానానికి పూర్తిగా విరుద్ధం. అనేక దేశాలు నెతన్యాహూను యుద్ధ నేరస్థుడిగా పరిగణిస్తున్నాయి. గజాలో ఇజ్రాయెల్ సృష్టిస్తున్న విధ్వంసానికి హమాస్ మీద నెపం మోపడం సులభమే. కానీ ఇజ్రాయెల్ నిరంతరం పలస్తీనియన్ల మీద చేస్తున్నందువల్ల్లే హమాస్ తిరగబడాల్సి వచ్చింది. అసలు పలస్తీనియన్ల జాతినే తుడిచి పెట్టేయడం ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం. 2023 అక్టోబర్ ఏడున పలస్తీనియన్లపై, ముఖ్యంగా గజాపై ఇజ్రాయెల్ డాడిలో ఇంతవరకు 68,858 మంది పలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 1,70,664 మంది గాయపడ్డారు. ఇవన్నీ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం లెక్కలే. ఇవి 2024 నవంబర్ ఒకటి నుంచి 2025 అక్టోబర్ 31 దాకా ఉన్న గణాంకాలు. ఇజ్రాయెల్ దాడిలో ఇంతకు ముందెన్నడూ ఏ యుద్ధంలో లేనంత మంది నిరాయుధ పలస్తీన పౌరులు నేలకొరిగారు. కనీవినీ ఎరగని మానవ సంక్షోభం కొనసాగుతోంది. దాదాపు గజా ప్రజలందరూ నిర్వాసితులయ్యారు. గజాలోని 81 శాతం మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ నాశనం చేసింది. 3,20,622 భవనాలు నేలమట్టమయ్యాయి. గజాలో 19లక్షల మంది నిర్వాసితులయ్యారు. అంటే గజా జనాభాలో 90 శాతం మంది నిర్వాసితులుగా మిగిలారు. గజా బాధితులకు మానవతా సహాయం అందకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంది. ఇది యుద్ధ నేరమే. సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన 543 మంది కార్యకర్తలు నేలకొరిగారు. ఇందులో 373 మంది ఐక్య రాజ్య సమితి సిబ్బంది. 112 మంది స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు. ఇదే వరసలో 1,772 మంది ఆరోగ్య కార్యకర్తలు ఇజ్రాయెల్ విచక్షణారహిత బాంబు దాడుల్లో అంతమయ్యారు. ఇప్పటికీ 95 మంది వైద్య సిబ్బంది నిర్బంధంలోనే ఉన్నారు. నిరంతర బాంబు దాడుల వల్ల గజాలో పంటలకు అవకాశమే లేకుండా పోయింది. 98.5 శాతం సేద్య భూమి ఎందుకూ పనికి రాకుండా తయారైంది. 463 మంది ఆకలితో అలమటించి అంతమయ్యారు. ఇందులో 157 మంది బాలలే. వార్తా సేకరణలో నిమగ్నమైన 103 మంది పత్రికా రచయితలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ బాంబుల వర్షం వల్ల గజాలోని నేల, నీరు, గాలీ పూర్తిగా కలుషితమైపోయాయి. 2024 ఆఖరు నాటికే పశువులు, కోళ్లు పూర్తిగా అంతమయ్యాయి. మారణకాండకు మారు పేరైన నెతన్యాహూతో మోదీ మంతనాలాడడం అంటే ఆశ్చర్యం కలుగుతోంది.1948 మే 14కు ముందు ఇజ్రాయెల్ అనే దేశమే ప్రపంచ పటంలో లేదు. యూదుల కోసం పలస్తీనియన్ల నేలపై బలవంతంగా ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటుచేశారు.
అంతకు 1930లు, 1940లలోనే మహాత్మాగాంధీ యూదులకు ప్రత్యేక దేశం ఏర్పాటుచేయడాన్ని గట్టిగా వ్యతిరేకించారు. 1938లో, 1946లో గాంధీ తన హరిజన పత్రికలో రాసిన వ్యాసాల్లో ఈ వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తం చేశారు. పలస్తీనా అరబ్బులదే అని గట్టిగా వాదించేవారు. బ్రిటన్ సహాయంతో యూదుల కోసం విడిగా ఓ దేశాన్నే ఏర్పాటుచేయడం అన్యాయమే కాదు, అహింసా సూత్రాలకు విరుద్ధమని గాంధీ భావించారు. ఫ్రాన్స్ ఎలా ఫ్రెంచి వారిదో, ఇంగ్లాండు ఎలా ఇంగ్లీషు వారిదో అలాగే పలస్తీనా అరబ్బులదే అని గాంధీ గట్టిగా చెప్పేవారు. బ్రిటిష్ వారి బయొనెట్ల నీడన కాకుండా అరబ్బుల మద్దతు కోసం యూదులు ప్రయత్నించాలని గాంధీ అన్నారు. మైనారిటీ వర్గం ఆకాంక్షలకు వ్యతిరేకంగా యూదుల కోసం ప్రత్యేక రాజ్యం అవతరించడాన్ని గాంధీ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వచ్చారు. యూదులు తమ దేశాలకు వెళ్లి అక్కడ హక్కుల కోసం పోరాడాలని గాంధీ అనేవారు. ప్రత్యేక దేశం కోరడం భావ్యం కాదని మహాత్ముడి భావన. అయినా యూరప్‌లో యూదులు పడ్డ బాధలకు గాంధీ సంపూర్ణ సానుభూతి వ్యక్తం చేశారు. యూదులను వేధించడం క్రూరత్వమే అన్నారు. పలస్తీనా వ్యవహారంలో కాంగ్రెస్ విధానాలు, స్వాతంత్య్రం ÔÁరువాత భారత ప్రభుత్వ విధానాలు గాంధీ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అనుగుణమైనవే. స్వాతంత్య్రానంతరం భారత్ ఎప్పుడూ పలస్తీనియన్లకు అండగానే నిలబడుతూ వచ్చింది. 1990లో ఇజ్రాయెల్‌తో స్నేహానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ బంధం బలపడుతూ వచ్చింది. ఇజ్రాయెల్‌కు సన్నిహితం అవుతున్నట్టు బహిర్గతంగా చెప్పకుండానే మోదీ ప్రభుత్వం ఇజ్రాయెల్‌ను భుజాన వేసుకుంటోంది. ఏ దేశంతోనూ మైత్రి తప్పు కాదు. కానీ ప్రస్తుతం ఇజ్రాయెల్ చేతులు రక్తపంకిలమై ఉన్నాయి. 2017లో మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో మైత్రీ కాంక్ష మరింత పెరిగిపోయింది. ఇజ్రాయెల్‌లో పర్యటించిన మొదటి ప్రధాని మోదీనే. నెహ్రూ కూడా యూదులకు ప్రత్యేక దేశ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూనే వచ్చారు. కానీ 1950నాటికి ఇజ్రాయెల్ పటం ప్రపంచపటంలో స్థిరపడిపోయింది. దానితో భారత ప్రభుత్వం ఇజ్రాయెల్‌ను గుర్తించక తప్పలేదు. పలస్తీనాను మొట్టమొదట గుర్తించిన దేశం మనదే. ఆ తరవాత ఇజ్రాయెల్ నుంచి ఆయుధ కొనుగోళ్లు, అమ్మకాలు మామూలు అయిపోయాయి. గజా మీద ఇజ్రాయెల్ బాంబులు కురిపిస్తున్న దశలో భారత్ ఇజ్రాయెల్‌కు సైనిక సహాయం అందజేసిందంటే బీజేపీ పాలనలో విధానాలు ఎలా విరూపం చెందాయో గమనించవచ్చు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఒకసారి ఇజ్రాయెల్ వెళ్లొచ్చారు. 2003లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఇజ్రాయెల్ నాయకుడు ఏరియల్ షారోన్‌కు స్వాగతం పలికారు. హోంమంత్రిగా ఉన్నప్పుడు రాజ్‌నాథ్‌సింగ్ సైతం ఇజ్రాయెల్ సందర్శించారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ సహాయం తీసుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. తీవ్రవాదాన్ని అరికట్టడానికి తీవ్రవాద దేశం సహాయం అవసరం కావడం వింతల్లోకెల్లా వింత. గజా మీద దాడిని ఖండిస్తూ 45 దేశాలు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ సమావేశంలో తీర్మానం ప్రతిపాదిస్తే భారత్ Âగైర్హాజరయ్యింది. మోదీ పూర్తిగా ఇజ్రాయెల్ వైపు మొగ్గిపోయారు.


