–వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి: ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కడా నిర్లక్ష్యం వహించవు రాదు అని ఏపీ సీఎం చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నపాధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన, శ్రీకాకుళంలో డయేరియా అంశాలపై బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం, శ్రీకాకుళం ఘటనల్లో బాధితుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆస్పత్రుల్లో అందుతున్న చికిత్స గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం ఘటనలో ప్రస్తుతానికి 76 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. పట్టణంలోని జెమ్స్ ఆస్పత్రిలో విషమంగా ఉన్న ఇద్దరు బాధితుల ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరాతీశారు. ఒకరికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని.. మరొకరికి డయాలసిస్ చేస్తున్నామని అధికారులు చెప్పారు. చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇద్దరు మినహా అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరాను ఆపేసి.. ట్యాంకర్లతో సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. రాజమహేంద్రవరం ఘటనలో బాధితులు నిరంతర వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అధికారులు సీఎంకు చెప్పారు. పాల శాంపిళ్లను ఇప్పటికే ల్యాబ్‌కు పంపామని.. నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. శాఖాపరంగా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టామని అధికారులు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.


