రాష్ట్రవ్యాప్తంగా 62.76 లక్షల మందికి రూ. 2725 కోట్ల విడుదల
కొత్తగా 8,977 మందికి కూడా ఈ నెల నుంచే పెన్షన్
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట కల్పించే వార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన పింఛన్లను ఒకరోజు ముందుగానే, అంటే ఫిబ్రవరి 28వ తేదీనే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 62,76,322 మంది పింఛనుదారులకు రూ. 2725.79 కోట్లు పంపిణీ చేయనున్నారు. కొత్తగా మంజూరైన 8,977 మంది వితంతు (స్పౌస్) పెన్షన్ లబ్ధిదారులకు కూడా ఈ నెల నుంచే పింఛను అందనుంది. వీరి కోసం అదనంగా రూ. 3.59 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నేరుగా పింఛను డబ్బును అందజేస్తారని మంత్రి వివరించారు.
ఫిబ్రవరి 28న పింఛను అందుకోలేకపోయిన వారికి, మిగిలిన వారికి మార్చి 2వ తేదీన సచివాలయ సిబ్బంది ఇంటివద్దకే వెళ్లి పంపిణీ పూర్తి చేస్తారని శ్రీనివాస్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పింఛన్ల కోసం రూ. 57,808.68 కోట్లు ఖర్చు చేసిందని, ఇది సామాజిక భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.


