భారతదేశ జనాభా లెక్కింపు -2027 దేశ, రాష్ట్రాలు అభివృద్ధికి ప్రామాణిక డేటా అత్యంత ముఖ్యమైన జాతీయ కార్యక్రమం..
జనాభా లెక్కలు సేకరణలో పాల్గొనుట అదృష్టంగా భావించాలని మన సర్వీసుకు తీపిగుర్తులు అని, మనస్సుపెట్టి పనిచేసి లక్ష్యాలను అధిగమించాలి….
మూడు రోజులు శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని, భారతదేశ జనాభా లెక్కింపు మొదటి దశకు సంసిద్ధులు కావాలి…
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి…
విశాలాంధ్ర ఏలూరు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం భారత జనాభా లెక్కింపు- 2027 మొదటి దశలో గృహనిర్మాణ మరియు గృహ గణన జిల్లా మరియు చార్జ్ స్థాయి అధికారులకు 24-02- 2026 నుండి 26-02-2026 వరకు మూడు రోజులు శిక్షణ తరగతులు సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన తొలిరోజు శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టరుతో పాటు, ఏపీ జనాభా లెక్కలు జాయింటు డైరెక్టరు, నేషనల్ ట్రైనరు జి.వి.చంద్రకళ, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జనాభా లెక్కింపు-2027 దేశ, రాష్ట్రాలు అభివృద్ధికి ప్రామాణిక డేటాను అందించే అత్యంత ముఖ్యమైన జాతీయ కార్యక్రమo అని, భారతదేశ జనాభా లెక్కింపు -2027 సేకరణలో పాల్గొనుటలో ఒక గొప్ప అదృష్టంగా భవించాలని, భవిషత్తులో తీపిజ్ఞాపకాలుగా ఉంటాయని మనస్సుపెట్టి పనిచేసి లక్ష్యాలను సాధించాలని అన్నారు.గృహనిర్మాణ, గృహ గణన దశలో సేకరించే వివరాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రూపకల్పనకు, ప్రణాళికలు అమలుకు కీలకమని పేర్కొన్నారు. నేషనల్ ట్రైనరు అందించే శిక్షణలో మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకుని,ఖచ్చితత్వం,పారదర్శకతతో గణన ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ప్రతి గృహాన్ని సమగ్రంగా నమోదు చెయ్యడం ద్వారా సరైన, విశ్వసనీయ గణాంకాలు సిద్ధం అమవుతాయని చెప్పారు. ప్రతి పౌరుడు నిర్భయంగా, స్వేచ్ఛగా తన సమాచారాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉందని అన్నారు.ఈ శిక్షణలో జనాభా లెక్కింపు విధానాలు, ఫారమ్‌లు భర్తీ విధానం, డిజిటల్ సాధనాలు వినియోగం, ఫీల్డ్ స్థాయి సమస్యలు పరిష్కారం వంటి అంశాలపై సవివరంగా అవగాహన కల్పించ బడుతుందని తెలిపారు. జిల్లా మరియు చార్జ్ స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణను పూర్తిగా ఆకళింపు చేసుకుని జనాభా లెక్కింపు సేకరణకు ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. జిల్లా పరిపాలన యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసర మైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే చిన్న చిన్న సమస్యను అధిగమించవచ్చునని అన్నారు. మొదటిగా గ్రామాలు జాబితాలు సిద్ధం చేసుకోవాలని ఇళ్ల జాబితా, గృహాలు రకం, సౌకర్యాలు (నీరు, విద్యుత్తు, మరుగు దొడ్డులు) తదితర వాటిని నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రతి ఆవాసం, మురికివాడలు, మారుమూల ప్రాంతాలు కవర్ అయ్యేలా, డబుల్ ఎంట్రీ లేకుండా పకడ్బందీగా గణన చేపట్టాలని అన్నారు. సెన్సస్ మార్గదర్శకాలు మేరకు జిల్లాలో జనగణన పరిధులు నిర్ణయాలు, పట్టణ ప్రాంతాల్లో ఛార్జ్ సెన్సస్ ఆఫీసర్లుగా మున్సిపల్ కమిషనర్లను, గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్లు ఉంటారని అన్నారు. అదనపు ఛార్జ్ అధికారిగా యంపీడివోలు, టెక్నికల్ అసిస్టెంట్లుగా సహాయ గణాంక అధికారి, డిజిటల్ అసిస్టెంటు ఉంటారని తెలిపారు. ప్రతి పౌరుడు తన సమాచారంతో పాటు కుటుంబ సమాచారం వివరాలను అందించ వలసిన బాధ్యత ఉందని అన్నారు.జనగణన ప్రక్రియ దేశానికి అత్యంత కీలకమైనదని, ప్రతి అధికారి కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఆర్డీవో యం. అచ్యుత అంబరీష్, జెడ్పీ సిఈవో యం.శ్రీహరి, నగర పాలక సంస్థ కమీషనరు ఏ.భాను ప్రతాప్,సంబంధిత జిల్లా అధికారులు,జిల్లా కో-ఆర్డినేటరులు బి.భాగ్యప్ప, అశ్విన్ వాజ్ పేయి,తహశీల్దార్లు,యంపిడివోలు,మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సహాయ గణాంక అధికారులు, డిజిటల్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.


