. మండలిలో అధికార, ప్రతిపక్ష పోటాపోటీ నిరసనలు
. తిరుమలకు నెయ్యి సరఫరాపై చర్చకు వైసీపీ పట్టు
. గందరగోళం…వాయిదాల పర్వం
. 26న చర్చించేందుకు బీఏసీలో నిర్ణయం
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:శాసన మండలి సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. మండలిలో చైర్మన్ పోడియం వద్ద, మండలి వాయిదా అనంతరం చైర్మన్ చాంబర్ ఎదుట వైసీపీ సభ్యులు నిరసనలతో మండలి కార్యకలాపాలకు అడుగడుగునా అవాంతరం ఏర్పడింది. ప్రశ్నోత్తరాల సమయం ముందుకు కొనసాగలేదు. మండలి సమావేశం సోమవారం చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు అధ్యక్షతన ప్రారంభం కాగా… తొలుత తన టేబుల్‌పై ఉన్న వివిధ బిల్లులను డీమ్డ్‌గా ప్రకటించారు. హెరిటేజీ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీ ద్వారా తిరుమలకు నెయ్యి సరఫరా అంశంపైన, టీటీడీ నెయ్యి కల్తీ అంశంపైన చర్చకు పట్టుపడుతూ వైసీపీ సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్ తదితరులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించారు. సార్వత్రిక ఆరోగ్య బీమా అంశంపై టీడీపీ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ (రాజా), కావళి గ్రీష్మ, తిరుమలనాయుడు అడిగిన ప్రశ్నలకు… వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బదులిచ్చారు. ఈ సమయంలో వైసీపీ సభ్యులు ఒక్కసారిగా చైర్మన్ పోడియం వద్దకు దూసుకొచ్చి..హెరిటేజ్ అనుబంధ సంస్థ అయిన ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చించాలంటూ పట్టుపట్టారు. ‘హెరిటేజ్ కల్తీ…కల్తీ నెయ్యి, హెరిటేజ్‌కల్తీ…కల్తీపాలు, భోలేబాబా…చంద్రబాబా’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈలోగా వైసీపీ సభ్యులు మొండితోక అరుణ్ కుమార్, రమేశ్ యాదవ్, ఇజ్రాయేల్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు చైర్మన్ పోడియంపైకి వెళ్లి నినాదాలు చేశారు. మరికొందరు వైసీపీ సభ్యులు పోడియం కింద ఉంటూ ఇందాపూర్ డెయిరీపై చర్చకు పట్టుపట్టారు. దీంతో అధికార టీడీపీ సభ్యులు సైతం వారికి పోటీగా నిరసన తెలిపేందుకు పోడియం వద్దకు చేరుకున్నారు. మండలిలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో చైర్మన్ మండలిని కొద్దిసేపు వాయిదా వేశారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యుల తీరుపై టీడీపీ సభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ (రాజా) మండిపడ్డారు. పోడియం ఎక్కడం చైర్మన్ స్థానాన్ని అవమానపరచడమేనని ఆయన విమర్శించారు. సభను క్రమపద్ధతిలో ఉంచేందుకు మార్షల్స్‌ను పిలిపించి, నిరసనకారులను బయటకు పంపాలని డిమాండ్ చేశారు. సభ్యుల అతి చేష్టలను అదుపు చేయకపోతే చైర్మన్ వ్యవస్థపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదముందని చెప్పారు. వాయిదా అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు మండలి సమావేశం తిరిగి ప్రారంభమ వగా… స్పెషల్ మెన్షన్ కింద సభ్యులకు అవకాశం కల్పించారు. రాజమండ్రిలో కల్తీపాలు తాగి మరణాలు సంభవిం చడంపై ీVAంమంత్రి వంగలపూడి అనిత ప్రకటన చేశారు. అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు.
ఎట్టకేలకు నెయ్యిపై చర్చకు అంగీకారం
టీటీడీ లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై ఎట్టకేలకు చర్చకు సర్కారు అంగీకరిం చింది. సోమవారం జరిగిన శాసన మండలి బీఏసీ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 24వ తేదీ మంగళవారం హోంశాఖపై మండలిలో చర్చ జరగనుంది. 25వ తేదీ బుధవారం వ్యవసాయ శాఖపై, 26న తేదీన టీటీడీ లడ్డూలో నెయ్యి కల్తీపై చర్చ చేపట్టేందుకు మండలి బీఏసీ నిర్ణయించింది. ఈనెల 28వ తేదీన మండలికి సెలవు ప్రకటింగా, తిరిగి 4వ తేదీన సమావేశాలు పున:ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా మండలి ప్రతిపక్షనేత బొత్ససత్యనారాయణ జోక్యంచేసుకుని..అధికార పక్షం బీఏసీ సమావేశంలో ఒకటి చెప్పి సభలో ఇంకొకటి చెబుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జోక్యం చేసుకుంటూ సభలోను, బయటా ఒకటే చెబుతున్నామని స్పష్టం చేశారు. శాసనమండలితో పాటు బయట కూడా నెయ్యి కల్తీపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కల్తీ నెయ్యిపై మండలిలో వంద రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. తాము అసెంబ్లీలోను, శాసనమండలిలో ను కల్తీ నెయ్యిపై చర్చ పెడతామని మొదటి రోజే చెప్పామని గుర్తుచేశారు. దీంతో బడ్జెట్‌పై చర్చ పెట్టాలని ప్రతిపక్షనేత బొత్ససత్యనారాయణ పట్టుబ{్టగా..ఇప్పటికే బడ్జెట్‌పై చర్చ పూర్తి అయిందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వైసీపీ సభ్యులు ప్రజా సమస్యల్ని గాలికొదిలి, రాజకీయ ప్రయోజనాల అంశాన్ని ఎంచుకొన్నారని మంత్రి పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై నాలుగు రోజులపాటు వైసీపీ సభ్యులు మండలి సమయాన్ని వృథా చేశారని అన్నారు. కల్తీ నెయ్యిపై తాము చర్చకు సిద్ధమని అనేకమార్లు చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు ఎందుకు పట్టించుకోలేదని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
The post ఇందాపూర్ ప్రకంపనలు appeared first on Visalaandhra.


