డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతి.. మెక్సికోలో భారతీయులకు అడ్వైజరీ


మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్ మాఫియా నాయకుడు నెమెసియో ఒసెగుయెరా, ఎల్ మెంచోగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి, మృతి చెందినట్లు మెక్సికో సైన్యం ప్రకటించింది.ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో అతడు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.59 సంవత్సరాల వయస్సున్న ఎల్ మెంచోను అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో మెక్సికో సైన్యం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.అమెరికా గూఢచారి విభాగాల నుంచి అందిన సమాచారంతో జాలిస్కో రాష్ట్రంలోని తపాల్ప పట్టణంలో అతడు దాగి ఉన్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు ముట్టడి చేశాయి.సోదాలు కొనసాగుతున్న సమయంలో మెంచో అనుచరులు కాల్పులకు దిగగా,సైన్యం కూడా ఎదురుకాల్పులు చేపట్టింది

పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఆందోళనలు
తీవ్ర ఘర్షణలో మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయినట్లు సైన్యం తెలిపింది.ఈ ఆపరేషన్‌లో ఎల్ మెంచోతో పాటు అతడి గ్యాంగ్‌కు చెందిన మరో ఆరుగురు కూడా మృతి చెందినట్లు మెక్సికో భద్రతా వర్గాలు వెల్లడించాయి.
ఈ సంఘటన అనంతరం దేశంలోని పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి.
అతడి అనుచరులు అనేక ప్రాంతాల్లో వాహనాలకు నిప్పంటించారు.
ప్రధాన రహదారులను దిగ్బంధించి రాకపోకలను అడ్డుకున్నారు. సూపర్ మార్కెట్లు, బ్యాంకులపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేశారు.

మెంచోను పట్టుకున్న వారికీ రూ.136కోట్లు
ఎల్ మెంచో 2009లో జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ పేరుతో మాదకద్రవ్యాల ముఠాను స్థాపించాడు.గత పదిసంవత్సరాల్లో ఇది మెక్సికోలో అత్యంత ప్రభావశీల నేర సంస్థగా ఎదిగింది.
అమెరికాకు పెద్ద ఎత్తున డ్రగ్స్ అక్రమ రవాణా నిర్వహించిన ప్రధాన నాయకుడిగా అతడు గుర్తింపు పొందాడు. జాలిస్కో కార్టెల్‌ను అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.మెంచోను పట్టుకునే వారికి 15 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో సుమారు రూ.136కోట్లు)బహుమతిని ప్రకటించింది.
తాజా పరిణామాలపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్పందిస్తూ,ఁఎల్ మెంచోను పట్టుకునే చర్యల్లో మెక్సికో ప్రభుత్వానికి అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం సహకారం అందించింది.అతడు మా దేశానికి ఫెంటనిల్‌ను అక్రమంగా సరఫరా చేస్తున్నాడు. ఇలాంటి నార్కో ఉగ్రవాదులను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదుఁఅని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

భారత్‌ అడ్వైజరీ..
మెక్సికోలో నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది.ప్రస్తుత హింసాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తదుపరి ప్రకటనల వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. స్థానిక అధికారుల సూచనలు, తాజా సమాచారం నిరంతరం గమనించాలని తెలిపింది. అవసరమైతే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *