Last Updated:
వేసవిలో తాటి ముంజలకు డిమాండ్ పెరిగింది, డీహైడ్రేషన్ తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతున్నాయి, కడప వ్యాపారి ప్రసాద్ రోజుకు 10 నుంచి 15 వేల వరకూ ఆర్జిస్తున్నాడు
వేసవి కాలం మొదలైతే చాలు.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది చల్లని తాటి ముంజులే. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ ఫలం కేవలం దాహం తీర్చడమే కాదు, శరీరానికి చల్లదనాన్ని అందిస్తూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. మండే ఎండల్లో శరీరం వేడి తట్టుకోలేక డీహైడ్రేషన్‌కు గురవుతున్న సమయంలో, తాటి ముంజలు ఒక సహజ కూలింగ్ డ్రింక్‌లా పనిచేస్తూ ప్రజలకు ఉపశమనాన్ని ఇస్తున్నాయి.
ప్రస్తుతం మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు చల్లని ఆహారాల కోసం చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో తాటి ముంజలకు భారీ డిమాండ్ పెరిగింది. నిపుణులు కూడా వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు, నీటి లోపం రాకుండా ఉండేందుకు తాటి ముంజలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సహజసిద్ధంగా నీటి శాతం అధికంగా ఉండే ఈ ఫలం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ డిమాండ్‌ను అవకాశంగా మలుచుకున్న వారు కూడా ఉన్నారు. కడప జిల్లాకు చెందిన ప్రసాద్ అనే వ్యాపారి గత ఆరు సంవత్సరాలుగా ప్రతి వేసవిలో శ్రీ సత్య సాయి జిల్లా తలుపుల, కూటగుల ప్రాంతాలకు వచ్చి తాటి ముంజలు అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు. స్థానిక ప్రజలు తమను ఎంతో ఆదరిస్తారని, కడప నుంచి తీసుకొచ్చే ముంజలకు మంచి డిమాండ్ ఉంటుందని ఆయన చెబుతున్నారు.
ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, ఒక్క డజను ముంజలను సుమారు రూ.120 వరకు విక్రయిస్తున్నారు. రోజుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వ్యాపారం జరుగుతుందని చెప్పారు. వేసవిలో కూల్ డ్రింక్స్ కంటే సహజసిద్ధమైన ముంజలకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ చిన్న వ్యాపారం కూడా మంచి ఆదాయ వనరుగా మారింది.
తాటి ముంజలు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, ఎండ వేడి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. నీటి శాతం అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్‌ను నివారిస్తాయి. వేసవిలో తరచూ వచ్చే అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
ఇందులో విటమిన్-బి, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలసటను తగ్గించి శరీరాన్ని ఫ్రెష్‌గా ఉంచుతాయి. అలాగే వేసవిలో వచ్చే చెమటకాయలు, చర్మంపై దద్దుర్లు తగ్గించేందుకు ముంజలలో ఉండే నీటిని రాసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
ముంజలను తినేటప్పుడు వాటి పైపొరను తీసేయకుండా తింటే శరీరానికి అవసరమైన పీచు పదార్థం కూడా లభిస్తుంది. అయితే మరీ లేతగా ఉన్న ముంజలను ఎంచుకుంటే రుచి, ఆరోగ్య ప్రయోజనాలు రెండూ మెరుగ్గా ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముంజలకు మంచి డిమాండ్ ఉండగా, ప్రాంతాన్ని బట్టి డజను రూ.80 నుంచి రూ.120 వరకు ధరలు ఉన్నాయి.
మొత్తానికి ఎండల వేడి పెరుగుతున్న ఈ సమయంలో తాటి ముంజలు ప్రజలకు చల్లదనాన్ని అందించడమే కాకుండా, వ్యాపారులకు కూడా మంచి ఆదాయ మార్గంగా మారాయి. సహజసిద్ధమైన ఈ ఫలానికి పెరుగుతున్న డిమాండ్ చూస్తుంటే, వేసవిలో ముంజల రాజ్యం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Anantapur,Anantapur,Andhra Pradesh


