విశాలాంధ్ర-జేఎన్టీయూ: ఏపీ ఈసెట్ పరీక్ష 23న జరగనుంది. సెట్ చైర్మన్ ఉపకులపతి ప్రొఫెసర్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్, ప్రొఫెసర్ భానుమూర్తి ఈ విషయం వెల్లడించారు. జేఎన్టీయూ ఆర్యభట్టు ఆడిటోరియంలో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వీసీ ప్రొఫెసర్ సుదర్శన్‌రావు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేశామని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని చెప్పారు. పరీక్ష కేంద్రాలలోకి గంట ముందే అనుమతిస్తామని తెలిపారు. అనంతపురం జేఎన్టీయూ అధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 33,751 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పాలిటెక్నిక్ అనంతరం బీటెక్ మూడవ సంవత్సరంలో ప్రవేశాలకు కూడా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షలు మొత్తం రెండు సెషన్స్‌లో జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 95 సెంటర్లలో పరీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో కూడా విద్యార్థుల సౌకర్యార్థం ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన జేఎన్టీయూ ఎనిమిదవ సారి ఈ పరీక్ష నిర్వహిస్తోంది. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం ఏడున్నర గంటలకే అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించరు. జిల్లాలోని ఏడు కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనున్నదని, విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని సూచించారు.


