బీజేపీ జపం చేస్తున్న వారే రాముని డబ్బు లూటీ


దేవుని పేరిట రూ.20 వేల కోట్లు మాయం!
జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ధ్వజం
బెంగళూరు:
బీజేపీ జపం చేస్తున్న వారే అయోధ్య రాముని ఆలయం విరాళాలు లూటీ చేశారని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే విమర్శించారు. దేవనహళ్లిలో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. అయోధ్యలో రామమందిరం పేరిట రూ.20 వేల కోట్ల విలువైన బంగారం, నగదు మాయం అయిందని వార్తలు వస్తున్నాయన్నారు. దేవుని పేరిట ధర్మానికి నేతృత్వం వహించిన పెద్దలే దొంగతనం చేయడం దురదృష్టకరమని అన్నారు. మనిషి కోసమే ధర్మం పుట్టింది కానీ, ధర్మం కోసం మనిషి కాదని గ్రహించాలని చెప్పారు. కేవలం ధర్మం ఒక్కటే ఎవరినీ ఉద్ధరించదని స్పష్టం చేశారు. అందరూ ఐకమత్యంతో ఉంటూ, ఉత్తమ విద్యాభ్యాసం పొందాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో భక్తులు ఇచ్చిన విరాళాలను పక్కదారి పట్టించి, దొంగిలించింది దళితులా అని ప్రశ్నించారు. డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ గురించి ఆయన వివరిస్తూ… రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సామాన్య వ్యక్తికాదని, దేశంలోని పేదలు, ఆడబిడ్డల నుదుటి రాతను సరికొత్తగా రాసిన మహాపురుషుడని కొనియాడారు. నెహ్రూ, మహాత్ముని మార్గదర్శకత్వంలో మూడేళ్ల పాటు పలు దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, మన రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేశారు. దళితులకు, మహిళలకు ప్రత్యేకంగా రాజకీయ అవకాశాలను కల్పించేందుకు ముందుగా విద్యాభ్యాసం ముఖ్యమని అంబేద్కర్ ప్రతిపాదించారని తెలిపారు. పూణె ఒప్పందం చేసుకుని ఉండకపోతే దళితులకు ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉండేది కాదన్నారు. దురదృష్టవశాత్తు కర్నాటకలో అంబేద్కర్‌కు లభించవలసిన గౌరవం దక్కడం లేదన్నారు. కులం, సముదాయాల ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, దిల్లీ తదితర రాష్ట్రాల్లో అంబేద్కర్ పటాన్ని చూపిస్తూ ఓట్లు దండుకుంటున్న పార్టీలు, నేతలు ఆయన ఆదర్శాలను, తత్వాలను పాలించడం లేదని విమర్శించారు. అంబేద్కర్ చిత్రపటానికి హారాలు వేసి, నినాదాలు వేసినంత మాత్రాన దళితులకు మేలు జరగదని, ఆయన ఆశయాలను అమలులోకి తీసుకురావలసిన అవసరం ఉందని ఖడ్గే పునరుద్ఘాటించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *