కోల్ కతా: తమ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి చీలికలు చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మభ్యపెట్టి ఆకర్షించడం బిజెపి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కేవలం స్వార్థంతో ప్రతిపక్షాల గొంతు నొక్కి, అడ్డు తొలగించడంలో భాగంగానే ఇటువంటి చర్యలకు పూనుకుంటున్నారని ధ్వజమెత్తారు. టీఎంసీలో చోటుచేసుకుంటున్న మార్పులకు కాషాయ పార్టీనే కారణమని, అసమ్మతి నేతలను రెచ్చగొడుతోందన్నారు. తమ పార్టీలో నిజాయతీ లేని కొందరు నేతలు బీజేపీకు అమ్ముడుపోయారని ఆరోపించారు. అటువంటి వారు ధైర్యముంటే నేరుగా బీజేపీలో చేరి తనను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య రాజీనామా…తదనంతర పరిణామాల నేపథ్యంలో మమతా బెనర్జీ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. మమతా బెనర్జీకి సన్నిహితురాలిగా పేరున్న చంద్రిమా బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అన్ని బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. విశ్వాసం లేనిచోట పనిచేయడం సాధ్యంకాదని, అందుకే పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. అయితే, రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్నికైన నెల రోజులకే ఆమె రాజీనామా చేయడం గమనార్హం. మరోవైపు, ఈ నిర్ణయం ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే రెబల్ నేతలతో కలిసి ఓ సమావేశంలో చంద్రిమా పాల్గొనడంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. దీనికి దీదీ గట్టి కౌంటర్ ఇచ్చారు.


