ప్రైవేట్ కాలేజీలకు షాక్.. ఇంటర్ లో ఆ ప్రభుత్వ కళాశాల విద్యార్థికి 977 మార్కులు.. జిల్లా టాపర్..! tuni raja government college inter topper challenges. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

తుని రాజా ప్రభుత్వ కళాశాల విద్యార్థి నెలపర్తి అజయ్ కుమార్ ఇంటర్ ఎంపీసీ లో 1000 లో 977 సాధించి కాకినాడ జిల్లా బాయ్స్ టాపర్, కార్పొరేట్ కాలేజీలకు సవాల్

+

కాకినాడ

కాకినాడ జిల్లాలో నెంబర్ వన్ గా రాజా ప్రభుత్వ కళాశాల విద్యార్థి

ఇంటర్ ఫలితాలు వెలువడగానే సాధారణంగా కార్పొరేట్ కళాశాలల పేర్లు వినిపిస్తాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. ప్రభుత్వ కళాశాల కూడా కార్పొరేట్ కాలేజీలకు ఏమాత్రం తీసిపోదని తుని రాజా ప్రభుత్వ కళాశాల ఘనంగా నిరూపించింది. ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుండగా, అందులో ముఖ్యంగా ఒక విద్యార్థి జిల్లా టాపర్‌గా నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందాడు.

125 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన తుని రాజా ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యారంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చదివిన ఈ మహోన్నత విద్యాసంస్థ ఎన్నో తరాలగా విద్యార్థులను తీర్చిదిద్దింది. అలాంటి చారిత్రాత్మక కళాశాల నుంచి ఈసారి వచ్చిన ఫలితాలు మరింత గర్వకారణంగా మారాయి.

ఇంటర్ ఎంపీసీ గ్రూప్‌లో 1000 మార్కులకు గాను నెలపర్తి అజయ్ కుమార్ 977 మార్కులు సాధించి కాకినాడ జిల్లాలో బాయ్స్ విభాగంలో టాపర్‌గా నిలిచాడు. ప్రభుత్వ కళాశాలలో చదివి ఈ స్థాయి మార్కులు సాధించడం విశేషమని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ఫలితంతో కార్పొరేట్ కళాశాలల ఆధిపత్యానికి సవాల్ విసిరినట్లైంది. విద్యార్థి ప్రతిభపై ఆనందం వ్యక్తం చేసిన పట్టణ ప్రముఖులు, ఉపాధ్యాయులు అతన్ని “మట్టిలో మాణిక్యం”గా అభివర్ణిస్తూ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ కళాశాలలోనే ఇలాంటి ప్రతిభావంతులు వెలుగులోకి రావడం గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ కళాశాలలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ కళాశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని తెలిపారు. గతంలో ఇక్కడ చదివిన ఎంతోమంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, డీఎస్పీ, ఉపాధ్యాయులుగా ఎదిగారని వివరించారు.

మాదే టాప్ అని ప్రచారం చేసుకునే ప్రైవేట్ కళాశాలలకు సవాల్‌గా ఈ ఫలితాలు నిలిచాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రాజా వంశీకులు సైతం విద్యార్థిని ప్రత్యేకంగా సత్కరించి, మెడలో కండువా వేసి అభినందించారు. ఈ విజయంతో కళాశాల ప్రతిష్ఠ మరింత పెరిగింది.

ఇక రాబోయే ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించి అన్ని గ్రూపులు తుని రాజా ప్రభుత్వ కళాశాలలో అందుబాటులో ఉన్నాయని ఉపాధ్యాయుల బృందం తెలిపింది. ఈ విజయంతో మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాల వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి, ఈ ఫలితం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలపరిచింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *