నీట్ పరీక్ష లీకేజీపై స్పందించిన రాహుల్ గాంధీ


వైద్య విద్య జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్-యూజీ) 2026కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్లు వచ్చిన వార్తలపై లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. దాదాపు 22 లక్షలమంది నీట్ పరీక్షను రాశారని గుర్తు చేశారు. ఆ విద్యార్థులు పడిన కష్టాన్ని, వారి కలలను బీజేపీ సారథ్యంలోని అవినీతి వ్యవస్థ ఛిన్నాభిన్నం చేసిందని ఆయన ఃఎక్స్ః వేదికగా మండిపడ్డారు.

నీట్ పరీక్ష రద్దయిందని, దీంతో లక్షలాది మంది విద్యార్థుల కఠోర శ్రమ, త్యాగాలు, కలలు చిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల కోసం కొందరి తండ్రులు రుణాలు తీసుకున్నారని, మరికొందరి తల్లులు బంగారం అమ్మేశారని పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో నిద్రలేని రాత్రులు కష్టపడి చదివితే, వారికి దక్కిన ప్రతిఫలం పేపర్ లీకేజీ-పరీక్ష రద్దు అని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యా వ్యవస్థలో వ్యవస్థీకృతమైన అవినీతి పేపర్ లీకేజీకి నిదర్శనమని మండిపడ్డారు. ఇది కేవలం వైఫల్యం కాదని, యువత భవిష్యత్తుపై జరిగిన నేరమని విమర్శించారు. ప్రతిసారి పేపర్ మాఫియా ఎలాంటి శిక్ష లేకుండా తప్పించుకుంటోందని అన్నారు. కానీ విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష లీకేజీ కారణంగా విద్యార్థులు మరోసారి అదే మానసిక ఒత్తిడి, ఆర్థికపరమైన భారం, అస్థిరతను భరించాల్సి వస్తోందని అన్నారు. ప్రధాని మోదీ చెబుతోన్న అమృత్ కాలం దేశానికి విషమయంగా మారిందని అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *