పెట్రో ఎగుమతులు నిలిపివేసిన ఇరాన్
వాషింగ్టన్: చమురు మంటలు చల్లారడం లేదు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే ప్రపంచం ఇంధన సంక్షోభంతో సతమతమవుతోంది. ఈ క్రమంలో ఇరాన్ చమురుపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. తెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ బుధవారం ఆంక్షలను ప్రకటించారు. ఇరాన్, రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి ఉన్న ఆంక్షలు ఇటీవల అమెరికా సడలించిన సంగతి తెలిసిందే. ఈ సడలింపును పొడిగించేది లేదని తాజాగా బెసెంట్ స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే ఇరాన్ చమురు ఎగుమతులతో సంబంధాలు ఉన్న అనేకమంది వ్యక్తులు, చమురు సంస్థలు, నౌకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రెజరీ శాఖకు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం ప్రకటించింది. ఆంక్షలకు గురైన సంస్థలు… ఇరాన్ మాజీ సుప్రీం నేత అయతుల్లా అలీఖామేనీ రాజకీయ సలహాదారుడి కుమారుడు మహమ్మద్ హుస్సేన్ షమ్‌ఖానీ నేతృత్వంలోనివని తెలిపింది. ఫిబ్రవరిలో అమెరికా- ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అలీ ఖామేనీ సలహాదారుడు ప్రాణాలు కోల్పోయారు. హోర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకల రాకపోకలను అమెరికా దిగ్బంధిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది ఇరాన్‌పై ఆర్థికంగా తీవ్ర ఒత్తిడి కలిగించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ చమురుపై మరిన్ని ఆంక్షలు విధించడం గమనార్హం. ఇక, ఇరాన్ ఆర్థిక లావాదేవీలకు చైనా బ్యాంకులు సహకరించినట్లు తెలిస్తే, వాటిపై ద్వితీయ ఆంక్షలు విధించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బెసెంట్ హెచ్చరించారు.
పెట్రో కెమికల్ ఎగుమతులు నిలిపివేసిన ఇరాన్…
నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అన్ని పెట్రో కెమికల్ ఎగుమతులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఇరాన్‌కు చెందిన జాతీయ పెట్రోకెమికల్ కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు, శత్రు దాడుల వల్ల కలిగిన నష్టాల నేపథ్యంలో దేశీయ పరిశ్రమలకు, వినియోగదారులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎగుమతి అయి, ఇంకా విదేశాలకు చేరని సరకును కూడా వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా కంపెనీలకు సూచించారు. ఇప్పటికే గ్యాస్, చమురు కొరతతో చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. సమసిపోతోందన్న సమయంలో సమస్య మరింత జఠిలమవుతున్నట్లు కనిపిస్తోంది.
The post ట్రంప్ నిర్వాకం… ఇరాన్ చమురుపై మళ్లీ ఆంక్షలు appeared first on Visalaandhra.


