ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు లేదు.. శాశ్వత ఒప్పందమే లక్ష్యం: ట్రంప్


పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణను మరింత కాలం పొడిగించే ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టం చేశారు. తాత్కాలిక పరిష్కారాల కంటే శాశ్వత ఒప్పందం సాధించడానికే అమెరికా ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. టెహ్రాన్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, కాల్పుల విరమణను తిరిగి అమలు చేయకుండానే ఆ చర్చలు ముగిసే అవకాశం ఉందని తెలిపారు. ఒక ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చర్చలు ఏ విధంగా ముగిసినా, ఇరాన్‌తో శాశ్వత ఒప్పందం కుదిరితేనే అన్ని దేశాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్‌,టెహ్రాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ గడువు ఈ నెల 21తో ముగియనుంది.

కొత్త నాయకత్వంతో కలిసి పనిచేయడానికి అమెరికా సిద్ధం: ట్రంప్
ఈ నేపథ్యంలో చర్చల ద్వారా దీర్ఘకాలిక శాంతి ఒప్పందాన్ని సాధించాలనే ఆశతో అమెరికా ఎదురుచూస్తోందని ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్ వేదికగా రాబోయే రెండు రోజుల్లో ఇరాన్ అధికారులతో మరోసారి సమావేశం జరగనుందని ఆయన వెల్లడించారు. రెండో విడత చర్చలపై ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఆ సమావేశాలు ఎంతో ఫలప్రదంగా ఉండబోతున్నాయని చెప్పారు. గతంలో ఇరాన్‌లో ఉన్న అతివాద శక్తులు పోయి, ప్రస్తుతం కొత్త పాలన ఏర్పడిందని ట్రంప్ పేర్కొన్నారు.
ఆ కొత్త నాయకత్వంతో కలిసి పనిచేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *