. అందుబాటులోకి 14 వేల సూపర్ స్పెషాల్టీ బెడ్లు
. వైద్య విద్యకు మరింత ప్రోత్సాహం
. నిరుద్యోగుల ఉపాధి మెరుగుకు స్కిల్ వర్సిటీలు
. ఆసుపత్రి ప్రారంభోత్సవంలో భట్టి
విశాలాంధ్ర బ్యూరో ఖమ్మం/ సత్తుపల్లి: ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. “తెలంగాణ మోడల” పాలనను చూసి అనేక రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు చదువు, ప్రతి కుటుంబానికి ఆహార భద్రత, సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 14 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్లను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన నిధులు విడుదల చేసినట్టు చెప్పారు. ప్రతి ఒక్కరికీ వైద్యం, విద్య రెండు కళ్లుగా భావిస్తున్నట్టు తెలిపారు. సత్తుపల్లి ప్రజల ఆరోగ్యం… సంక్షేమం కోసం నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని బుధవారం ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోనే అదనంగా కల్లూరులో 50 పడకల ఆసుపత్రిని, పెనుబల్లిలో 30 పడకల ఆసుపత్రిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. వైద్య విద్యను ప్రోత్సహించే దిశగా సత్తుపల్లిలో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో విద్యుత్ సబ్‌స్టేషన్లతో పాటు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఇకో టూరిజం ప్రాజెక్టును కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సత్తుపల్లి, అశ్వారావుపేట, వైరా, ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను మంజూరు చేసినట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఈ టెక్నాలజీ సెంటర్లను దానికి అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ సెంటర్లలో అడ్మిషన్లు కల్పిస్తామని, శిక్షణ పొందే ప్రతి విద్యార్థికి నెలకు రూ.2,000 స్కాలర్‌షిప్ అందజేస్తామని ప్రకటించారు. టాటా వంటి సంస్థల భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు దక్కేలా శిక్షణ ఇస్తామన్నారు. తెలంగాణలోని 1.06 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో గతంలో 4,11,143 రేషన్ కార్డులు ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అదనంగా 57,088 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్టు తెలిపారు. జిల్లాలో 13,22,929 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తున్నట్టు వివరించారు. ఖమ్మం జిల్లాలో గత కొన్ని దశాబ్దాలుగా 3,40,236 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, అదనంగా 3,16,264 ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా మన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన … పనుల కోసం ఇప్పటికే రూ. 2,500 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. సత్తుపల్లి సమీపంలోని పులిగుండాల చెరువు, కనకగిరి హిల్స్ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక పటంలో నిలిచేలా “ఎకో టూరిజం” ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రకటించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్ట రాగమయి దయానంద్, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్, వైరా శాసనసభ్యులు మాలోతు రామదాసు నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ తదితరులు పాల్గొన్నారు.
అభివద్ధి పనులకు శ్రీకారం
సత్తుపల్లి నియోజకవర్గంలో వివిధ అభివద్ధి పనులకు భట్టి విక్రమార్క… మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి, మట్టా దయానంద్‌తో కలిసి శ్రీకారం చుట్టారు. కల్లూరు మండలం నారాయణపురం లో విద్యుత్ సబ్‌స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం కల్లూరులో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. పెనుబల్లి మండలంలోని ప్రసిద్ధ పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. పెనుబల్లి, తల్లాడ సబ్‌స్టేషన్ల అభివద్ధి పనులకు, సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామం, వేంసూరు మండలం వెంకటాపురం గ్రామాల్లో కూడా విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణాలకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, పోలీస్, అటవీ శాఖ అధికారులు, వైద్య అధికారులు, మున్సిపల్, ఏఎంసీ చైర్మన్లు, మహిళా, యువజన, ఎనఎస్‌యూఐ నాయకులు పాల్గొన్నారు.
The post అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం appeared first on Visalaandhra.


