అనంతపురం: చీరల వ్యాపారంలో మోసాలకు పాల్పడుతూ మహిళలను లక్ష్యంగా చేసుకున్న హనీ ట్రాప్ ముఠా గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. రాణి కాసుల రంగమ్మ అలియాస్ చిన్ని నేతృత్వంలో ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ముఠా పట్టుచీరల వ్యాపారం పేరుతో మహిళలను మోసం చేసి, వారి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
బాధితుల వివరాల ప్రకారం, ధర్మవరం, కంచి, బనారస్, మైసూర్ సిల్క్ వంటి ఖరీదైన చీరలను తక్కువ ధరకు ఇస్తామని ఆశ చూపి నమ్మకద్రోహం చేశారు. అంతేకాకుండా వడ్డీ వ్యాపారం, సెటిల్మెంట్లు, పంచాయితీలలో కూడా ఈ ముఠా జోక్యం చేసుకున్నట్లు సమాచారం. నూటికి పది రూపాయల వడ్డీకి అప్పులు ఇచ్చి, ఆస్తులను తనఖా వేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజకీయ అండదండలతో ఈ ముఠా కార్యకలాపాలు సాగిపోయాయని పలువురు ఆరోపిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో కూడా ఈ ముఠా యువతులను మోసరించిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని, అవసరమైతే సీబీఐ విచారణ చేపట్టాలని జిల్లా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే తప్ప నిజాలు బయటకు రావడం కష్టమని పలువురు అభిప్రాయపడుతున్నారు.


