Last Updated:
Kidney Stones: విశాఖపట్నంలో కూడా 42 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి మూత్రనాళం (Urinary Bladder) నుంచి ఏకంగా 600 గ్రాముల బరువున్న భారీ రాళ్లను తొలగించి ప్రాణాపాయం నుంచి తప్పించారు వైద్యులు.
Kidney Stones: మనం తీసుకునే ఆహారం, ఆరోగ్యం పట్ల చూపించే అశ్రద్ద, నిద్రలేమి వంటి సమస్యల కారణంగా చాలా మందికి కిడ్నీలో రాళ్లు రావడం ఈమధ్య కాలంలో కామన్ అయిపోయింది. విశాఖపట్నంలో కూడా 42 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి మూత్రనాళం (Urinary Bladder) నుంచి ఏకంగా 600 గ్రాముల బరువున్న భారీ రాళ్లను తొలగించి ప్రాణాపాయం నుంచి తప్పించారు వైద్యులు. ఇందులో టెన్నిస్ బాల్ పరిమాణంలో ఉన్న ఒక పెద్ద రాయితో పాటు మరికొన్ని చిన్న రాళ్లు ఉండటం విశేషం. పేషెంట్ మూత్రవిసర్జన సమయంలో మంట, క్రమంగా పొత్తికడుపులో భరించలేని నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరాడు. విశాఖపట్నంలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. మూత్రనాళంలో ఉన్న రాళ్లను తొలగించి అతనికి ఉపశమనం కలిగించారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన జి. రాజు గత కొన్ని నెలలుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రవిసర్జన సమయంలో మంటతో మొదలైన సమస్య, క్రమంగా పొత్తికడుపులో భరించలేని నొప్పిగా మారింది. రాత్రుళ్లు నిద్రలేని స్థితి, మూత్రం సరిగ్గా రాకపోవడంతో ఆయన శారీరకంగా, మానసికగా కుంగిపోయారు. గతంలో (2019లో) ఆయన కిడ్నీలో రాళ్ల కోసం శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ, మళ్లీ ఇలాంటి సమస్య ఎదురవుతుందని ఊహించలేదు.
నొప్పి భరించలేక ఆయన వైజాగ్‌లోని ‘ఐను’ ఆసుపత్రిని సంప్రదించారు. అక్కడి వైద్య బృందం సీటీ స్కాన్ నిర్వహించింది. అందులో మూత్రనాళంలో స్నూకర్ బాల్ పరిమాణంలో ఉన్న ఒక భారీ రాయితో పాటు మొత్తం ఐదు రాళ్లు ఉన్నట్లు గుర్తించి వైద్యులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆపరేషన్ చేసి వాటిని తొలగించాలని పేషెంట్ కు చెప్పారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, యూరో-ఆంకాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ జి. రవీంద్ర వర్మ నేతృత్వంలో మూత్రనాళంలో రాళ్లను తీసేశారు.
రాళ్ల పరిమాణం చాలా పెద్దదిగా ఉండటంతో సాధారణ పద్ధతుల్లో (Minimally Invasive) తొలగించడం సాధ్యం కాదని భావించిన డాక్టర్ రవీంద్ర వర్మ బృందం ‘ఓపెన్ సర్జరీ’ నిర్వహించాలని నిర్ణయించింది. అత్యంత జాగ్రత్తగా మూత్రనాళాన్ని తెరిచి, అర కిలోకు పైగా బరువున్న ఆ రాళ్లను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నారని, లక్షణాల నుంచి పూర్తి ఉపశమనం లభించిందని వైద్యులు తెలిపారు.
చాలామంది మూత్రవిసర్జనలో మంట లేదా చిన్నపాటి నొప్పిని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇలాంటి ప్రాథమిక సంకేతాలను వదిలేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. మూత్రంలో ఇన్‌ఫెక్షన్లు, పొత్తికడుపు నొప్పి వంటివి ఉంటే వెంటనే నిపుణులను సంప్రదించాలి. ముందుగా గుర్తిస్తే పెద్ద సర్జరీల అవసరం లేకుండానే చికిత్స అందించవచ్చని డాక్టర్ రవీంద్ర వర్మ
సూచించారు.
ఈ శస్త్రచికిత్సలో యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ ,ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అమిత్ సప్లే తో పాటు యూరాలజీ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ పి. శ్రీధర్ పాల్గొన్నారు.సంక్లిష్టమైన కేసులను డీల్ చేయడంలో తమ బృందం మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుకుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh



