బద్రీనాథ్‌లోనూ విరాళాల దుర్వినియోగం! – Visalaandhra


అంతర్గత విచారణకు కమిటీ ఆదేశాలు
బద్రీనాథ్ (ఉత్తరాఖండ్):
ఆయోధ్య రాముని ఆలయ విరాళాల చోరీతో దేశ వ్యాప్తంగా హిందూ దేవాలయల సొత్తుపై పెద్ద చర్చ నడుస్తుంటే…ఇప్పుడు విష్ణు ఆలయంలో విరాళాల దుర్వినియోగం అంటూ ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తోన్న ఈ ఆరోపణలను ఆలయ కమిటీ తీవ్రంగా పరిగణించింది. వెంటనే అంతర్గత విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై బద్రినాథ్, కేథారినాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) అధ్యక్షుడు హేమంత్ ద్వివేది మాట్లాడుతూ… ‘నిధుల దుర్వినియోగం జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తున్నందున విచారణ కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. ఈ వ్యవహారానికి సంబంధించి విధుల్లో ఉన్న ఉద్యోగుల వివరాలనూ కోరాం’ అని తెలిపారు. కాగా… బద్రీనాథ్ ఆలయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని భైరవ సేన అనే ఓ సంస్థ ఆరోపించింది. ఆలయ కమిటీ ఛైర్మన్ వ్యక్తిగత సహాయకుడికి సంబంధమున్న నిధుల దుర్వినియోగం ఆరోపణలపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. దీనిపై అధ్యక్షుడు ద్వివేది స్పందిస్తూ…సోషల్ మీడియాలో తన వ్యక్తిగత కార్యదర్శిగా పేర్కొన్న వ్యక్తి బీకేటీసీలో ఓ ఉద్యోగి మాత్రమేనన్నారు. ఆయన గతంలో ముగ్గురు మాజీ ఛైర్మన్ల వద్ద పనిచేశారని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై బీకేటీసీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి సోహన్ సింగ్ రంగడ్ మాట్లాడుతూ.. ‘నిధుల దుర్వినియోగం ఆరోపణలు రావడంతో వెంటనే ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాం. కానీ ఆ ఫుటేజీ స్పష్టంగా లేకపోవడంతో పూర్తివివరాలు తెలియరాలేదు. అయినప్పటికీ ఈ విషయం అత్యంత సున్నితమైనదిగా భావించి, ఛైర్మన్‌కు నివేదించాం’ అని చెప్పారు. ఛైర్మన్ ఆదేశాలతో సదరు ఉద్యోగుల వివరాలు సేకరించడం సహా వారిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు అంతర్గత కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామన్నారు. విచారణలో ఎవరైనా తప్ప్పుచేసినట్లు రుజువైతే…వారిపై బీకేటీసీ చట్టం-1939, ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *