క్రీడా మైదానంలో ప్రహరీ గోడ నిర్మాణం.. నార్పల యువత భవిష్యత్తుతో చెలగాటమా..?


విశాలాంధ్ర – నార్పల:- మండల కేంద్రంలోని క్రీడా మైదానంలో ప్రహరీ గోడ నిర్మాణానికి జరుగుతున్న ప్రయత్నాలు క్రీడాకారులు, యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. దశాబ్దాలుగా నార్పల క్రీడా సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ మైదానం నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన పలువురు క్రీడాకారులు ఎదిగారు. అలాంటి మైదానాన్ని క్రమంగా కుదిస్తూ యువత భవిష్యత్తును దెబ్బతీయడం సరైన నిర్ణయం కాదని క్రీడాభిమానులు మండిపడుతున్నారు.ఇప్పటికే మైదానం విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందని, క్రికెట్ ఆటకు అత్యంత కీలకమైన సిక్స్ లైన్ ప్రాంతం కూడా పరిమితమైందని క్రీడాకారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి ప్రహరీ గోడ నిర్మిస్తే క్రికెట్‌తో పాటు కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు టోర్నమెంట్లకు ఇతర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జట్లు వచ్చేవని, ప్రస్తుతం మైదానం పరిస్థితి కారణంగా ఆసక్తి చూపడం లేదని పేర్కొంటున్నారు.కాలేజీ పరిసరాల్లో ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ క్రీడా మైదానాన్నే లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటని యువకులు ప్రశ్నిస్తున్నారు. క్రీడలకు ఉపయోగపడే స్థలాన్ని తగ్గించి ప్రహరీ గోడ నిర్మించడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, కానీ యువతకు మాత్రం శాశ్వత నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యువతను చెడు అలవాట్లు, వ్యసనాల నుంచి దూరంగా ఉంచే శక్తి క్రీడలకే ఉందని, అలాంటి క్రీడా వేదికలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొంటున్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే క్రీడా మైదానాన్ని కాపాడకుండా దాని విస్తీర్ణాన్ని కుదించడం అభివృద్ధి కాదని, యువత అవకాశాలను హరించడమేనని విమర్శిస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రహరీ గోడ నిర్మాణంపై పునరాలోచన చేయాలని, క్రీడాకారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మైదానాన్ని యథాతథంగా పరిరక్షించాలని నార్పల యువత డిమాండ్ చేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *