మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయం – Visalaandhra


. ఆడపడుచుల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీకి రూ.10 వేల కోట్లు చెల్లింపు
. మహిళా సంఘాలతో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు
. బ్యాంక్ లింకేజీ రుణాలు రూ.10 లక్షలకు పెంపు
. కార్పొరేట్ తరహా మహిళా సూపర్ బజార్లు
. స్త్రీ శక్తి భవనాల శంకుస్థాపనలో సీఎం రేవంత్

విశాలాంధ్ర – హైదరాబాద్: తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, అందుకే వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా మహిళలు అభివృద్ధి సాధించినప్ప్పుడు రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందని బలంగా నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. అందులో భాగంగానే మహిళల ఆర్థిక స్వాలంభన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధ్దితో ప్రయత్నం చేస్తోందన్నారు. ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం మహిళా వారోత్సవాలను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. బటన్ నొక్కి 8000 ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టే అద్భుతమైన కార్యక్రమమని అన్నారు. 8000 భవనాలకు ఒకే సారి శంకుస్థాపన దేశంలోనే ఒక సంచలన నిర్ణయంగా పేర్కొన్నారు. 2023, డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రూ. 10 వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించామన్నారు. మహిళా అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధి తార్కాణమని భావించి ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని స్పష్టం చేశారు. బస్సులకు మహిళలను యజమానులను చేయాలని 1000 బస్సు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా చేశామని తెలిపారు. జూన్ 5న పరేడ్ గ్రౌండ్‌లో 553 బస్సులను ప్రారంభించబోతున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 1000 మెగావాట్ల సోలార్ ఎనర్టీ ప్లాంట్లను మహిళా సంఘాలతో ఏర్పాటు చేయిస్తున్నామని అన్నారు. పెట్రోల్ బంక్ వ్యాపారాన్ని మహిళా స్వయం సహాయ సంఘాలతో చేయిస్తు న్నామని పేర్కొన్నారు. రూ. 5 లక్షల బ్యాంక్ లింకేజీ లోన్లను రూ.10 లక్షలకు పెంచుతున్నామని, ఇప్పటి వరకు రూ.60 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ లోన్లు అందించామని వివరించారు. సున్నా వడ్డీ రుణాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1,390 కోట్లను చెల్లించిందన్నారు. మహిళా సంఘాలు రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకోవాలని, మండలాల్లో గోడౌన్లు, లాస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 100 ఎకరాల వరకు భూములను ఇవ్వడానికి ప్రయత్నం సిద్ధంగా ఉందని, రైస్ మిల్లులు, గోడౌన్ల కోసం ప్రభుత్వ భూములను కేటాయిస్తామని అన్నారు. స్వయం సహాయ మహిళా సంఘాలు వడ్లు కొనుగోలు చేసి బియ్యం ప్రభుత్వానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైస్ మిల్లులు, గోడౌన్ల ఏర్పాటు కోసం సున్నా వడ్డీతో బ్యాంక్ లింకేజీ ఏర్పాటు చేసి కావాల్సిన రుణాలను మంజూరు చేస్తామని అన్నారు. మహిళా సంఘాలతో మహిళా శక్తి సూపర్ బజార్లు కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాదారుగా ఉంటుందన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని, 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని అభిప్రాయపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *