పెనుకొండ నియోజకవర్గ రైతులకు 67 విద్యుత్ ట్రాన్స్ పార్మర్లు పంపిణీ
విశాలాంధ్ర, పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గ విద్యుత్ డివిజన్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన రైతులకు మంజూరైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యవసాయానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్లు త్వరితగతిన మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.వ్యవసాయ రంగ బలోపేతానికి విద్యుత్ శాఖ ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలో అధికారులు పర్యవేక్షణ నిర్వహించి రైతులు విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి కుటుంబం సౌర విద్యుత్‌ను వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. దీని వల్ల విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్, నూతన విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ వంటి కార్యక్రమాలను ప్రాధాన్యంగా అమలు చేస్తోందన్నారు.సోమవారం రొద్దం మండలానికి 16, సోమందేపల్లి మండలానికి 14, పెనుకొండ మండలానికి 10, గోరంట్ల మండలానికి 12, పరిగి మండలానికి 15 ట్రాన్స్ఫార్మర్లను రైతులకు అందజేశారు. మొత్తం 67 ట్రాన్స్ఫార్మర్లను రైతులకు అంకితం చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 368 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కరెంటు చార్జీలు తగ్గించామని, లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌ఈ మోసెస్, ఈఈ చంద్రనాయక్, పుట్టపర్తి శివరాం, డీఈలు శేషగిరిబాబు, జోష్ణ, ఏఈలు, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కేశవయ్య, శ్రీరామ్ యాదవ్, మాధవ నాయుడు, సింగిల్ విండో అధ్యక్షులు, పార్టీ కన్వీనర్లు, రైతులు మరియు కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.


