Last Updated:
అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో 34 రోజుల్లో హుండీల ద్వారా రూ.2,05,15,095, బంగారం, వెండి, 15 దేశాల కరెన్సీ లభించి రికార్డు ఆదాయం నమోదైంది
అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. వేసవి సెలవులు, వివాహాల సీజన్, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో రత్నగిరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో స్వామివారికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయం రికార్డు స్థాయికి చేరుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేవలం 34 రోజుల్లోనే రూ.2 కోట్లకు పైగా ఆదాయం రావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తెలుగు కుటుంబాల్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం చేయడం, అన్నవరం దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అదే భక్తి భావనతో ఇటీవల భారీ సంఖ్యలో భక్తులు రత్నగిరికి తరలివస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు పెద్దఎత్తున దేవస్థానంలో జరుగుతుండటం, సెలవుల కారణంగా కుటుంబాలతో కలిసి భక్తులు రావడం వల్ల క్షేత్రం సందడిగా మారింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతులు, దర్శన ఏర్పాట్లు కూడా దేవస్థానం కల్పిస్తోంది.
ఇటీవల దేవస్థాన కార్యనిర్వహణ అధికారి చక్రధర్ రావు ఆధ్వర్యంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు, శ్రీవారి సేవకుల సమక్షంలో జరిగిన ఈ లెక్కింపులో 34 రోజుల వ్యవధిలో రూ.2,05,15,095 ఆదాయం సమకూరినట్టు అధికారులు వెల్లడించారు. ఇదే కాకుండా 42 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 954 గ్రాముల 500 మిల్లీగ్రాముల వెండి కూడా భక్తులు కానుకగా సమర్పించారు. మరో విశేషం ఏమిటంటే.. 15 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా హుండీల్లో లభించింది.
గోదావరి జిల్లాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఇటీవలి కాలంలో భారీగా భక్తులు తరలివస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రావడంతో మహిళా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అంటున్నారు. దీంతో దేవస్థానాల ఆదాయం కూడా క్రమంగా పెరుగుతోందని పేర్కొంటున్నారు. అన్నవరం, వాడపల్లి వంటి క్షేత్రాలు ప్రస్తుతం భక్తుల రద్దీతో కళకళలాడుతున్నాయి.
ఇక వీకెండ్ రోజుల్లో అన్నవరం వెళ్లే భక్తులకు దేవస్థానం ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు జరిగే స్వామివారి ప్రాకార సేవలో భక్తులు ఉచితంగా పాల్గొనే అవకాశం ఉంది. అలాగే ఆదివారం నిర్వహించే పల్లకి సేవలో రుసుము చెల్లించి భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. భక్తి, ఆధ్యాత్మికత, విశ్వాసం కలిసిన ఈ పవిత్ర క్షేత్రం ఇప్పుడు రికార్డు ఆదాయంతో మరోసారి వార్తల్లో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


