Last Updated:
Andhra Pradesh SIR 2026 Schedule: ఈ ప్రక్రియలో మరణించిన ఓటర్ల పేర్లు తొలగిస్తారు. స్థానికంగా లేని ఓటర్ల పేర్లు తొలగిస్తారు. అలాగే.. డూప్లికేట్ ఓటర్ల పేర్లను తొలగిస్తారు. అలాగే.. కొత్తగా చేర్చాల్సిన ఓటర్ల పేర్లను చేర్చుతారు.
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) షెడ్యూల్ విడుదల చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఫేజ్-3లో భాగంగా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతోంది. ఏపీలో జూన్ 5 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలను స్వచ్ఛం చేసి, పారదర్శకంగా మార్చుతారు. అక్రమాలకు చెక్ పెడతారు. మే 12, 2026 నాటికి రాష్ట్రంలో 4,16,16,061 ఓటర్లు ఉన్నారని ECI డేటా ప్రకారం తెలుస్తోంది.
జూన్ 5 నుంచి 14 వరకు సన్నద్ధత, సిబ్బందికి శిక్షణ, ముద్రణ కార్యక్రమాలు జరుగుతాయి. జూన్ 15 నుంచి జులై 14 వరకు బూత్ లెవల్ అధికారులు (BLOs) ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, వివరాలు సేకరిస్తారు. ఈ సమయంలో ఓటర్ల నుంచి ఏ పత్రాలూ సేకరించరు. ఓటర్లు తమ వివరాలు నింపి ఫారాలు అందజేయాలి. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ కూడా జులై 14లోగా పూర్తి చేస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితా జులై 21న విడుదల అవుతుంది. క్లెయిమ్లు, అభ్యంతరాలు జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు స్వీకరిస్తారు. నోటీసుల దశ, విచారణ సెప్టెంబరు 18 వరకు కొనసాగి, తుది ఓటర్ల జాబితాని సెప్టెంబరు 22న ప్రచురిస్తారు. క్వాలిఫయింగ్ డేట్ జులై 1గా ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.
46,397 BLOలు, రాజకీయ పార్టీలు నియమించే 68,868 బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) ఈ ప్రక్రియలో పాల్గొంటారు. రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ స్టేషన్కు BLAలను నియమించాలని ECI కోరింది. ఇది ప్రక్రియను మరింత పారదర్శకంగా చేస్తుందని ఏపీ సీఈఓ వివేక్ యాదవ్ తెలిపారు. 2002 తర్వాత 24 ఏళ్లలో ఇదే మొదటి ఇంటెన్సివ్ రివిజన్ కావడం విశేషం. ఇందులో మరణించిన ఓటర్ల పేర్లు తొలగిస్తారు. స్థానికంగా లేని ఓటర్ల పేర్లు తొలగిస్తారు. అలాగే.. డూప్లికేట్ ఓటర్ల పేర్లను తొలగిస్తారు. అలాగే.. కొత్తగా చేర్చాల్సిన ఓటర్ల పేర్లను చేర్చుతారు. ఇలాంటి ప్రక్రియను 3సార్లు చేపడతారు. ఈ టైంలో ఓటర్లకు నోటీసులు పంపడం, వారిని ప్రశ్నించడం వంటివి జరుగుతాయి.
ఓటర్లు తమ వివరాలు నిజమైనవే అని నిరూపించుకోవడానికి CEO ఆంధ్ర పోర్టల్ లేదా voters.eci.gov.in కి వెళ్లవచ్చు. 2002 జాబితాలతో అనుసంధానం కోసం ECI లింకులు అందుబాటులో ఉన్నాయి. 18 ఏళ్లు పైబడిన కొత్త ఓటర్లు ఫారం-6 ద్వారా ఆన్లైన్ లేదా BLOల ద్వారా ఓటర్లుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అనర్హుల పేర్లు తొలగించేటప్పుడు.. వారి అభిప్రాయాల్ని తెలుసుకోవాలని ECI స్పష్టం చేసింది. సీజనల్ మైగ్రేంట్లు, లాక్డ్ హౌస్ల విషయంలో మూడు సార్లు సందర్శన తర్వాతే చర్యలుంటాయి.
ఈ సవరణ ద్వారా ఓటర్ల జాబితాలు స్వచ్ఛమై, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ఓటర్లు, అధికారులు సహకరించాలని ECI, CEO యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియ సెప్టెంబరు చివరి వరకు కొనసాగి, భవిష్యత్ ఎన్నికలపై నమ్మకాన్ని పెంచుతుంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 20, 2026 10:40 AM IST



