మరో తిరుపతిగా మారుతున్న వాడపల్లి.. 50 రోజుల్లోనే రూ.3.24 కోట్ల ఆదాయం..! Vadapalli Venkateswara Swamy temple | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

కోనసీమ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీకి 50 రోజుల్లో 3 కోట్ల 24 లక్షలకుపైగా ఆదాయం, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ లభ్యంతో మరో తిరుపతిగా పేరు పొందుతోంది

+

News18

News18

ఆంధ్రప్రదేశ్‌లో మరో తిరుపతిగా వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న.. కోనసీమ ప్రాంతంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా మారుతోంది. చందన రూపిడిగా స్వయంభుగా వెలిసిన ఈ క్షేత్రానికి రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతుండగా, తాజాగా వచ్చిన హుండీ ఆదాయం దేవస్థానం చరిత్రలోనే రికార్డుగా నిలిచింది.

ఏడేడు జన్మల పుణ్యఫలం.. ఏడువారాల వెంకన్న దర్శనం అనే నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వాడపల్లికి తరలివస్తున్నారు. స్వామివారిని ఏడువారాలు దర్శించి, ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ విశ్వాసమే ఇప్పుడు ఆలయ ఖ్యాతిని మరింత పెంచుతోంది.

తాజాగా దేవదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో భారీ స్థాయిలో ఆదాయం నమోదైంది. కేవలం 50 రోజుల వ్యవధిలోనే స్వామివారికి మొత్తం రూ.3 కోట్ల 24 లక్షల 82 వేల 615 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి చక్రధర్ రావు వెల్లడించారు. ఇందులో ప్రధాన హుండీల ద్వారా రూ.2 కోట్ల 44 లక్షల 76 వేల 932 రాగా, అన్నప్రసాదం హుండీల ద్వారా మరో రూ.80 లక్షల 5 వేల 683 వచ్చినట్లు తెలిపారు.

ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు భారీగా బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. భక్తులు సమర్పించిన కానుకల్లో 50 గ్రాముల బంగారం, 73 గ్రాముల 544 మిల్లీగ్రాముల వెండి లభించగా, 14 దేశాలకు చెందిన 51కిపైగా విదేశీ కరెన్సీ నోట్లు కూడా బయటపడ్డాయి. దీంతో వాడపల్లి వెంకన్న ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని అధికారులు పేర్కొంటున్నారు.

ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత తిరిగి ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకోవడం భక్తుల్లో మరింత విశ్వాసాన్ని పెంచుతోంది. భక్తుల రద్దీ, హుండీ ఆదాయం, పెరుగుతున్న ఖ్యాతి చూస్తుంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నిజంగానే మరో తిరుపతిగా అభివృద్ధి చెందుతోందని స్థానికులు చెబుతున్నారు. కోనసీమ ఆధ్యాత్మిక పటంలో ఈ క్షేత్రం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ రోజురోజుకూ మరింత వైభవాన్ని సంతరించుకుంటోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *