Amaravati: అమరావతి అభివృద్ధిలో మరో అడుగు.. కిమ్స్‌కి సీఎం చంద్రబాబు శంకుస్థాపన | ఆంధ్రప్రదేశ్ వార్తలు


ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కిమ్స్ ఆస్పత్రి చిన్న స్థాయిలో ప్రారంభమై ఇప్పుడు 30 వేల కోట్ల ఆస్తిగా విస్తరించిందని, ఎంట్రప్రెన్యూర్‌షిప్ ద్వారా మాత్రమే దేశం, రాష్ట్రం సంపద సృష్టి సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు. అమరావతి అభివృద్ధికి చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ గతంలో తక్కువ ఆస్పత్రులు, హోటళ్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు దేశానికి మెడికల్ హబ్‌గా మారిందని, దీనికి KIMS లాంటి సంస్థలే కారణమని తెలిపారు.

అమరావతి రాజధానిలో ఇది వినూత్న ప్రయోగం. విద్య, వైద్య రంగాల్లో తిరుగులేని స్థాయిలో 23 ఎకరాల్లో కాలేజీ, 2 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటవుతోంది. మెడికల్ కాలేజీ, స్కిల్ యూనివర్సిటీ ద్వారా లక్ష మందికి నైపుణ్యాలు అందించేలా సంస్థ ఏర్పాటు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లకు భారీ డిమాండ్ ఉందని, డాక్టర్లు కూడా AI నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం వ్యాఖ్యానించారు.

సీఎం చంద్రబాబు 2027 ఇదే రోజుకు ఆసుపత్రి, యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఇటీవల గూగుల్ ఫౌండేషన్ వేశామని, 2028 ఆగస్టు లోపు నిర్మాణం పూర్తి చేసి ఆపరేషన్ ప్రారంభించాలని సూచించారు. ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ శంకుస్థాపన చేశామని, 2028 డిసెంబర్‌లో ఫేజ్-1 పూర్తి చేయాలని ఆదేశించారు. శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు, కార్యకలాపాలు కూడా త్వరగా మొదలు కావాలని పేక్షించారు. అనుమతులు ఆటోపైలట్ మోడ్‌లో ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని, నిర్మాణాలు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించడం పారిశ్రామికవేత్తల బాధ్యత అని స్పష్టం చేశారు.

ఉద్యోగాలు, నైపుణ్యాలు:

లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వడమే తన ఆలోచన అని, పిల్లల భవిష్యత్తు చూస్తానని చంద్రబాబు అన్నారు. 23 నెలల క్రితం రాష్ట్రంలో ఆరాచకం, విధ్వంసం జరిగిందని, అలాంటి పాలన తన జీవితంలో చూడలేదని వ్యాఖ్యానించారు. 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో 250 మెడికల్ సీట్లు, 1000 నాన్-మెడికల్ సీట్లు, మరో 1000 ట్రైనీలు తయారు చేయాలనీ… డెంటల్, ఫిజియోథెరపీ వంటి రంగాల్లో సుమారు 5000 మందిని నియమించుకునే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి అమరావతిలోనే శిక్షణ ఇచ్చేలా ఈ స్కిల్ ఇన్‌స్టిట్యూట్ తయారు కావాలని ఆకాంక్షించారు.

ఇదే తరహాలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏపీలో ఏర్పాటు చేస్తున్నామని, డిసెంబరు నాటికి దేశంలో మొదటి క్వాంటం కంప్యూటర్ అమరావతికి చిరునామా అవుతుందని తెలిపారు. ఇప్పటికే క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ఏర్పాటు అయింది. త్వరలో 133 క్యూబిట్ సామర్థ్యంతో క్వాంటం కంప్యూటర్ వస్తుంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల పెట్రోలు, గ్యాస్ కొరత వచ్చిందని, విదేశాలపై ఆధారపడకుండా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకోవాలని కార్యాచరణ చేపట్టామన్నారు. ప్రతి పొలం, ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేయాలని సూచించారు. గత పాలకులు 32 వేల కోట్ల విద్యుత్ భారం వేశారని, ఇప్పుడు కొనుగోలు వ్యయం తగ్గించి ఛార్జీలు తగ్గిస్తున్నామని చెప్పారు.

వైద్య, హెల్త్‌కేర్ అవకాశాలు:

మెడికల్, హెల్త్ రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయని, చాలా దేశాల్లో వృద్ధాప్య సమస్య ఉందని, వైద్యుల కంటే నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ఎక్కువ డిమాండ్ ఉందని హైలైట్ చేశారు. ఏ దేశంలో డిమాండ్ ఎక్కువో అక్కడికి వెళ్లి సేవలు అందించేలా భాషలు నేర్చుకోవాలని కోరారు. బైసర్ సంస్థ AI ఆధారిత కంటి అద్దాలు అందించిందని, దృష్టి లోపం ఉన్నవారు స్వతంత్రంగా పని చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు 20 వేల కోట్లు కేటాయించామని, సంజీవని ద్వారా డిజిటల్ వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. KIMS సంస్థ వైద్యంతో పాటు ప్రివెంటివ్ హెల్త్‌కేర్ అందించాలని సూచించారు.

రాష్ట్రం, రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారని, వారి భవిష్యత్తుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైద్య సేవల కోసం దేశ-విదేశాల నుంచి వచ్చేవారికి విమానాశ్రయం, హోటళ్లు వంటి సదుపాయాలు ఉండాలని, రెండో దశ భూసమీకరణ ద్వారా అమరావతిని భవిష్యత్ నగరంగా నిర్మిస్తున్నామన్నారు. అమరావతితో పాటు విశాఖను విశ్వనగరంగా, రాయలసీమను హార్టికల్చర్, టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని, 15వ తేదీన రాయలసీమలో ఫైటర్ జెట్ పరిశ్రమ శంకుస్థాపన చేస్తామని, కర్నూలు డ్రోన్ సిటీగా, శ్రీసిటీ ఇండస్ట్రియల్ హబ్‌గా మారాయని వివరించారు.

ఈ ప్రాజెక్ట్ అమరావతిని విద్య, వైద్య, టెక్నాలజీ హబ్‌గా మార్చడంలో కీలకం. యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి సంపద సృష్టి వైపు ముందడుగు వేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *