విశాఖలో కొత్త అద్భుతం.. కైలాసగిరిపై 65 అడుగుల భారీ త్రిశూలం..! Kailasagiri trident Visakhapatnam | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖపట్నం కైలాసగిరిలో 65 అడుగుల భారీ త్రిశూలం, డమరుకం ఏర్పాటు, VMRDA అభివృద్ధి చేసిన ఈ కొత్త ఐకాన్ రాత్రి లైటింగ్‌తో పర్యాటకులను ఆకర్షిస్తోంది

+

News18

News18

విశాఖపట్నం అంటేనే అందమైన సముద్ర తీరం, కొండలు, ప్రకృతి సోయగాలు గుర్తుకొస్తాయి. అలాంటి విశాఖలో ఇప్పటికే పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్న కైలాసగిరి ఇప్పుడు మరింత ప్రత్యేకంగా మారింది. శివపార్వతుల విగ్రహాలతో ప్రసిద్ధి చెందిన ఈ కొండపై తాజాగా ఏర్పాటు చేసిన భారీ త్రిశూలం ఇప్పుడు నగరానికి కొత్త ఐకాన్‌గా నిలుస్తోంది.

సిటీలో ఎక్కడి నుంచైనా కనిపించేలా 65 అడుగుల ఎత్తుతో రూపొందించిన ఈ భారీ త్రిశూలం పర్యాటకుల చూపును కట్టిపడేస్తోంది. దీనికి అనుసంధానంగా 10 నుంచి 18 అడుగుల డమరుకాన్ని కూడా ఏర్పాటు చేశారు. కైలాసగిరి కొండపై తెలుగు సాంస్కృతిక నికేతన్ మ్యూజియం సమీపంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ను విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) రూపకల్పన చేసి అభివృద్ధి చేసింది.

ఇప్పటికే రోప్‌వే, జిప్‌లైన్, గ్లాస్ బ్రిడ్జ్ వంటి ఆకర్షణలతో సందడిగా ఉండే కైలాసగిరి.. ఇప్పుడు ఈ త్రిశూలంతో మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా రాత్రివేళ వెలుగులు విరజిమ్మే ఈ భారీ త్రిశూలం సిటీ మొత్తాన్ని ఆకట్టుకుంటోంది. దూరం నుంచే కనిపించే ఈ ప్రకాశవంతమైన నిర్మాణం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. సెల్ఫీలు, రీల్స్ కోసం యువత పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు.

త్రిశూలం వద్ద ప్రత్యేకంగా వ్యూ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి చూస్తే విశాఖ నగరం, సముద్ర తీరం, కొండల అందాలు ఒకేసారి కనిపిస్తూ అద్భుత అనుభూతిని కలిగిస్తున్నాయి. సాయంత్రం సమయాల్లో ఇక్కడి వాతావరణం మరింత మంత్రముగ్ధులను చేస్తోంది.

విశాఖను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే దిశగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. విశాఖకు వచ్చే ప్రతి పర్యాటకుడికి ఈ త్రిశూలం మరో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారుతుందని చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు ఎలాంటి ప్రత్యేక ఫీజు లేదని, కైలాసగిరికి వచ్చే ప్రతి ఒక్కరూ ఉచితంగా వీక్షించవచ్చని తెలిపారు.

రాత్రివేళల్లో అద్భుతంగా కనిపించేలా ప్రత్యేక లైటింగ్‌తో దీనిని డిజైన్ చేశామని, విశాఖ నగరానికి ఇది కొత్త గుర్తింపుగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇకపై కైలాసగిరికి వెళ్లే ప్రతి పర్యాటకుడు శివపార్వతులతో పాటు ఈ భారీ త్రిశూలం, డమరుకం వద్ద ఫొటోలు దిగకుండా తిరిగి రావడం కష్టమే అనిపిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *