పెట్రోల్ కొరత కాదు.. దొంగల భయం.. ట్యాంకులు ఫుల్ చేసుకుంటే రాత్రికి ఖాళీ.. ఆ జిల్లాలో అసలేం జరుగుతోంది? | అనంతపురం వార్తలు (Anantapuram News)


Last Updated:

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత రూమర్లతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు, బ్లాక్ విక్రయాల ఆరోపణలు, చార్జీలు పెరగగా, అధికారులు కొరతలేదని చెబుతున్నారు

+

News18

News18

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ కొరతపై కలకలం రేగింది. అధికారికంగా ఎలాంటి కొరత లేదని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో వాహనదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

అనంతపురం నగరంలో ఒకటి రెండు బంకులు మాత్రమే తెరిచి ఉండగా, మిగతావన్నీ మూసివేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. దీంతో వాహనదారులు రాత్రంతా బంకుల వద్దే కాపులు కాస్తూ పెట్రోల్ కోసం వేచి ఉండాల్సి వచ్చింది. కొందరు ఫుల్ ట్యాంక్ చేసుకుంటే, మరికొందరు క్యాన్లలో నిల్వ చేసుకునేందుకు క్యూలలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది.

పెట్రోల్ దొరకదన్న భయంతో చాలా మంది ద్విచక్ర వాహనదారులు ముందుగానే ట్యాంక్ ఫుల్ చేసుకున్నా, రాత్రిపూట దొంగలు వాహనాల నుంచి పెట్రోల్ దొంగిలించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంధన కొరత ప్రభావం ప్రయాణాలపై కూడా పడింది. వివాహాల సీజన్ కావడంతో ఇప్పటికే రాకపోకలు పెరిగిన సమయంలో డీజిల్ అందుబాటులో లేకపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రైవేట్ వాహనదారులు చార్జీలు భారీగా పెంచేశారు. బెంగళూరు వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.1000 తీసుకునే వారు, ప్రస్తుతం రూ.3000 వరకు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. కర్నూలు, హైదరాబాద్ మార్గాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.

ఇక కొందరు బంక్ యజమానులు స్టాక్ దాచిపెట్టి బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వందల సంఖ్యలో వాహనదారులు ఇంధనం కోసం బంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఈ మొత్తం పరిస్థితిపై అధికారులు మాత్రం స్పష్టత ఇచ్చారు. జిల్లాలో ఎలాంటి పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ఇది కేవలం అపోహల వల్ల ఏర్పడిన పరిస్థితి మాత్రమేనని కదిరి తహసీల్దార్ రెడ్డి శేఖర్ తెలిపారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులు మాత్రం ప్రజల్లో ఇంకా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి, ఇంధనంపై వచ్చిన ఒక్క రూమర్ జిల్లా మొత్తాన్ని కలవరపరిచింది. వాస్తవ పరిస్థితి ఏదైనా, ప్రజల్లో ఏర్పడిన భయాందోళన మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *